హుస్నాబాద్, సెప్టెంబర్ 2: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరుగుతున్న జాతీయ రహదారి పనులను త్వరగా పూర్తిచేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో హైవే పనులు నత్తనడకన నడుస్తున్నందున వర్షం పడినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డ్రైనేజీ నిర్మాణ పనులు 15రోజుల్లో పూర్తి చేయాలని గడువు విధించారు. సోమవారం హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌తోపాటు హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పట్టణంలో జరుగుతున్న హైవే పనుల నిర్వహణపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. డ్రైనేజీ పనుల అనంతరం విద్యుత్ స్తంభాలు వేయడం, ఎంక్రోచ్మెంట్ ఉన్న వాటిని తొలిగించాలన్నారు. పోతారం నుంచి వచ్చే వరద డ్రైనేజీలోకి సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. హైవే పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నందున ఎవరు అడ్డుకున్నా పోలీసు బందోబస్తు మధ్య పనులు పూర్తి చేయాలన్నారు. నాలాలపై నిర్మాణం, అక్రమ నిర్మాణాలు చేసిన వారికి నోటీసులు ఇవ్వాలన్నారు. భారీ వర్షాల వల్ల డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయని, వీటిపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. సర్కారు దవాఖాన వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించి రోగులకు వైద్యసేవలందించాలన్నారు. దవాఖానల్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు.
ఎక్కడ కూడా విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలన్నారు. అక్కన్నపేట మండలంలో భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నట్లు తెలిసిందని, వాటిపై వెంటనే నివేదిక అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. డిగ్రీ కళాశాల చుట్టూ చేరిన వర్ష పు నీటిని బయటకు పంపేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కోహెడ మండలం బస్వాపూర్ వద్ద రాకపోకలు నిలిచినందున నిర్మాణం పూర్తయిన బ్రిడ్జిని వెంటనే అందుబాటులోకి తేవాలని హైవే అధికారులను ఆదేశించారు. సమీక్షలో చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్ చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, కౌన్సిలర్లు, ఆర్డీవో రామ్మూర్తి, ఏసీపీ సతీశ్, కమిషనర్ మల్లికార్జున్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.