హుస్నాబాద్, నవంబర్ 7: సమగ్రకుల గణను దేశానికే దిక్సూచిగా మారనున్నదని, దీనికి ప్రజలందరూ సహకరించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యం కుల గణన ద్వారా భవిష్యత్తులో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనుల కోసం రూ.10కోట్ల నిధు లు మంజూరయ్యాయని, వీటితో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు.
నియోజకవర్గాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. అన్ని కులాలకు రీడింగ్ రూమ్స్ పేరుతో ఒక్కోటి రూ.45 లక్షల చొప్పున కేటాయించామన్నారు. పట్టణంలో నాలుగు చౌరస్తాలను ఆధునీకరించేందుకు రూ.2కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. ఎల్లమ్మ చెరువు కట్ట ఆధునీకరణ కోసం రూ.18కోట్లు, కొత్తపల్లి-హుస్నాబాద్ నాలుగు లేన్ల రో డ్డుకు రూ.75కోట్లు వచ్చాయన్నారు. దవాఖానను 250 పడకలకు అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు. ఆరు గ్యారెంటీలు రాని వారు వెంటనే అధికారులను సంప్రదించాలన్నారు. రెండు లక్షలపైన రుణమాఫీ త్వరలోనే అవుతుందన్నారు. పట్టణంలో రేషన్ షాపుల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చారు.
ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తనవద్దకు పైరవీలు, ఇతరత్రా పనుల కోసం రావొద్దని మంత్రి పొన్నం అన్నారు. నిత్యం వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయన్నారు. ఆర్టీసీ, విద్యాశాఖలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని, ఈ రెండు శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఇక నుంచి తనవద్దకు రావొద్దని కోరారు. రవాణా శాఖ మంత్రిగా ఉండి ఆ శాఖలోనే సిఫారసులు చేయడం బాగుండదని, ఉద్యోగులు అర్థం చేసుకోవాలని అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే జిల్లా లో పకడ్బందీగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరిం చి పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు. జిల్లా లో 2.36లక్షల ఇండ్లు ఉన్నాయని, వీటి సర్వే కోసం 2,300మంది ఎన్యూమరేటర్లు, ఇతర స్పెషలాఫీసర్లను నియమించామని, ఈ నెలాఖరులోగా సమగ్ర సర్వే పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశామని చెప్పా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.