సంగారెడ్డి, నవంబర్ 7: సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ రోడ్‌షోకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం పట్టణంలోని గంజీమైదాన్లో 20వేల మంది కార్యకర్తలతో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగసభ ఏర్పాట్లను టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ దగ్గరుండి పరిశీలించారు. సభకు తరలివచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని వారు పార్టీ నాయకులకు సూచించారు. మంత్రి కేటీఆర్ స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3.30గంటలకు కంది శివారులోని కింగ్స్ దాబా నుంచి భారీ బైక్ ర్యాలీ ప్రారంభంకానున్నది. అక్కడి నుంచి పోతిరెడ్డిపల్లి నుంచి బైక్ ర్యాలీతో గంజీమైదాన్కు భారీ జనసందోహంతో సభా ప్రాంగణానికి మంత్రి కేటీఆర్ సాయంత్రం 4.30గంటలకు చేరుకుంటారు. దాదాపు గంటకు పైగా సంగారెడ్డి రోడ్‌షోలో మంత్రి ప్రచారం నిర్వహించనున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.వెంకటేశ్వర్లు, నర్సింలు, నాయకులు బొంగుల రవి, విజయేందర్‌రెడ్డి తదితరులున్నారు.
మంత్రి రోడ్‌షోను
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రోడ్‌షో, బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కంది శివారులోని కింగ్స్ దాబా నుంచి భారీ బైక్ ర్యాలీతో కంది చౌరస్తా, పోతిరెడ్డిపల్లి చౌరస్తాల మీదుగా పట్టణంలోకి ప్రారంభమై సభ వేదికకు చేరుకుంటుందన్నారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కుటుంబసభ్యులు అధికసంఖ్యలో పాల్గొని మంత్రి సభను విజయవంతం చేయాలని కోరారు.