పటాన్చెరు, ఏప్రిల్ 15 : వేలాది పరిశ్రమలు, లక్షలాది కార్మికులకు నిలయమైన పటాన్‌చెరుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన మంజూరు చేసింది. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు సైతం ప్రారంభించింది. ఈ ప్రాంత కార్మికులు, పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైవ్యసేవలు అందించేందుకు నాటి సీఎం కేసీఆర్ రూ.184.87 కోట్లు మంజూరు చేశారు. 2023న జూన్ 22న స్వయంగా కేసీఆర్ దవాఖాన పనులకు శంకుస్థాపన చేశారు.
నాటి ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వేగంగా ఈ దవాఖాన పనులు చేయించారు. అంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రావడంతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులకు గ్రహణం పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. కేసీఆర్‌కు క్రెడిట్ రావద్దనే కాంగ్రెస్ ప్రభుత్వం దవాఖాన పనులు ఆలస్యం చేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి.
కార్మికులు, పేదలను దృష్టిలో ఉంచుకొని దవాఖాన మంజూరు…
పటాన్చెరు ప్రాంతం హైదరాబాద్‌కు సమీపంలో ఉండడం, పారిశ్రామిక వాడలు ఉండడంతో ఎక్కవ మంది కార్మికులు నివాసం ఉంటున్నారు. అంతేకాకుండా చాలామంది పేదలు ఈ ప్రాంతంలో వివిధ పనులు చేసుకుని బతుకుతున్నారు. వీరందరికీ కార్పొరేట్ వైద్యసేవలు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ దవాఖాన నిర్మాణ పనులు ప్రారంభించింది.
పటాన్చెరు ప్రాంతంలో అనేక రాష్ర్టాల కార్మికులు పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా కార్మికులు అనారోగ్యానికి గురైతే ఇక్కడి సర్కారు దవాఖానను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఇక్కడ పెద్దవైద్యం అందడం లేదు. దీంతో పాటు పటాన్చెరు సర్కార్ దవాఖానకు రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన అందుబాటులోకి వస్తే కార్మికులు, పేదలకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది.
అసంపూర్తిగా పనులు
పటాన్‌చెరులోని 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణం పూర్తిచేసి రంగులు వేశారు. దవాఖాన లోపల రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. భవనానికి విద్యుత్ సౌకర్యం కల్పించడం, రోగుల కోసం బెడ్లు, ఆక్సిజన్ పైపులైన్, రోగులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు ఆపరేషన్ థియేటర్, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
దవాఖానలో రోగులకు అత్యవసర పరిస్థితిలో కార్పొరేట్ స్థాయిలో చికిత్సలు అందించేందుకు భవన నిర్మాణ సమయంలో ప్రత్యేక గదులు నిర్మాణం చేసేందుకు ప్రణాళిక చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను చూపడంతో దవాఖాన అందుబాటులోకి రావడం లేదు. జిల్లాకు చెందిన దామోదర రాజనర్సింహ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆయన స్పందించి సూపర్ స్పెషాలిటీ దవాఖానలో అన్ని పనులు పూర్తిచేసి తమకు అందుబాటులోకి తేవాలని ఈ ప్రాంత ప్రజలు, కార్మికులు కోరుతున్నారు. పటాన్చెరు దవాఖానకు ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులు చికిత్స కోసం వస్తున్నారు. పాత భవనంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ దీని మీద దృష్టి సారించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.