ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయి. మెదక్ జిల్లా కేంద్రం పిల్లికోటాల్ సమీపంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్) ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. గతేడాది మే నెలలో మంత్రి హరీశ్‌రావు ఈ దవాఖానను ప్రారంభించగా ఏడాదిలోనే ఉత్తమ సేవలందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. గర్భిణులు దవాఖానలో చేరినప్పటి నుంచి బిడ్డతో సహా ఇంటికి చేర్చే వరకు అన్ని సేవలు ఉచితంగా అందిస్తుండడంతో రోజురోజుకీ ఆదరణ పెరుగుతున్నది. గత ఏడు నెలల్లో 2467 డెలివరీలు నిర్వహించడంతో పాటు 2108 మంది బాలింతలకు కేసీఆర్ కిట్ అందజేశారు. పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించి చికిత్స అందించేందుకు మూడు నెలల క్రితం టిఫ్ఫా స్కానింగ్ సౌకర్యం కల్పించగా, త్వరలోనే క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రానున్నది. రూ. 23.75కోట్లతో నిర్మించనున్న ఈ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు నేడు శంకుస్థాపన చేయనున్నారు.
సర్కారు దవాఖానలు ‘అమ్మ’కు వరంలా మారాయి. మెరుగైన వైద్య సేవలతో తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి తల్లీబిడ్డల సంరక్షణకు కృషి చేస్తున్నది. ప్రసవాల సంఖ్య పెంచేందుకు కేసీఆర్ కిట్, 102 వాహనాలు, మహిళ గర్భం దాల్చి దవాఖానకు వచ్చినప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. పుట్టిన బిడ్డను పర్యవేక్షిస్తూ టీకాలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నది. ప్రసవాల సంఖ్య పెంచడంలో మెదక్ ఎంసీహెచ్‌లో వైద్య సిబ్బంది ప్రత్యేక చొరవ కనబరుస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రం పిల్లికోటాల్ సమీపంలో మాతా శిశుసంరక్షణ కేంద్రాన్ని 2022 మే 28న ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ ఏడు నెలల్లో 2467 డెలివరీలు చేయగా, 2108 బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేసి మంచి గుర్తింపు పొందారు.
మెదక్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో ప్రసవ సేవలు పొందే వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నది. సీఎం కేసీఆర్ 102 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చి బాలింతతోపాటు సహాయకురాలు, ఆశ కార్యకర్త కూర్చునేలా వాహనంలో సీటింగ్ సదుపాయం కల్పించారు. సర్కారు దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయిన బాలింత, పసిబిడ్డను వారి ఇంటి వద్దకు సురక్షితంగా చేర్చడమే లక్ష్యంగా సేవలు అందిస్తున్నారు. మెదక్ మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు నుంచి ప్రతి నెలా 300లకు పైగా డెలివరీలు చేస్తుండగా, సర్కారు దవాఖానల సేవలపై గర్భిణులు, తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జూలైలో 167 కేసీఆర్ కిట్లు అందజేయగా, ఆగస్టులో 281, సెప్టెంబర్‌లో 332, అక్టోబర్‌లో 326, నవంబర్‌లో 363, డిసెంబర్లో 324, జనవరి 2023లో 315 కేసీఆర్ కిట్లను బాలింతలకు అందజేశారు. మొత్తంగా 2108 కేసీఆర్ కిట్లు ఇచ్చారు.
మెదక్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో టిఫ్పా స్కానింగ్ యంత్రాన్ని 2022 నవంబర్ 28న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. గర్భస్థ దశలోనే పిండం లోపాలను గుర్తించి తగిన చికిత్స అందిస్తే వాటిని లోపాలను నివారించడానికి ఆస్కారం ఉంటుంది. టిఫ్పా స్కానింగ్ పరికరాలతో లోపాలను గుర్తించే సౌకర్యం ఉండడంతో దీని ఉపయోగం ఎంతో మందికి లబ్ధి చేకూరుతున్నది.
ఎంసీహెచ్‌లో సాధారణ ప్రసవాల పెంపునకు కృషి చేస్తున్నాం. ప్రసవ సేవలు విస్తృతం చేసేలా వైద్యులు, సిబ్బందిని మరింత అప్రమత్తం చేస్తున్నాం. ఎంసీహెచ్‌కు వచ్చే గర్భిణులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎంసీహెచ్ ప్రారంభించి ఏడు నెలల్లోనే 2467 డెలివరీలు చేశాం. ప్రతి నెలా 370కు మించి కాన్పులు అవుతున్నాయి.
– డాక్టర్ పి.చంద్రశేఖర్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్
మెదక్ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో క్రిటికల్ కేర్ బ్లాక్‌కు ఆదివారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. గతంలోనే దీని నిర్మాణానికి రూ.23.75 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే మెదక్ దవాఖానలో ఐసీయూ, డయాలసిస్, నవజాత శిశు కేంద్రం, డయాగ్నోస్టిక్ హబ్, బ్లడ్‌బ్యాంక్ వంటి సౌకర్యాలు ఉండగా, పట్టణ శివారులో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందులోనే రూ.80 లక్షలతో రేడియోలజీ విభాగాన్ని నిర్మిస్తున్నారు. కాగా, నేడు క్రిటికల్ కేర్ బ్లాక్‌కు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
ఎంసీహెచ్‌లో ఎక్కువగా నార్మల్ డెలివరీలు అయ్యేలా చూస్తున్నాం. ఎంసీహెచ్‌కు వచ్చే గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. 24 గంటల పాటు డాక్టర్లు అందుబాటులో ఉండి ప్రసవాలు చేస్తున్నాం. ఎంసీహెచ్‌లో 24 గంటల్లో 25 ప్రసవాలు చేసి మెతుకుసీమ రికార్డు బద్ధలు కొట్టాం.
– డాక్టర్ శివదయాల్, గైనకాలజిస్ట్, ఎంసీహెచ్