సిద్దిపేట అర్బన్/ నంగునూరు ఏప్రిల్ 2: కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయి.. నేడు చెరువుల్లోకి నీళ్లు వచ్చాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేశామన్నారు. ఆదివారం నంగునూరు మండలం పెద్దవాగుపై ఉన్న ఘనపూర్ చెక్‌డ్యామ్, సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని మహారాష్ట్ర రైతులు సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించేందుకు అనేక సార్లు ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో తిరిగామని.. నాటి ఇబ్బందులు అధిగమించిన విధానాన్ని మంత్రి మహారాష్ట్ర రైతులకు వివరించారు. మంత్రి వివరిస్తున్న సమయంలో రైతులు పలుమార్లు చప్పట్లు కొట్టి తమ హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉపయోగించిన మోటర్లను 4,5 దేశాల నుంచి తెప్పించినట్లు మంత్రి తెలిపారు. కరోనా సమయంలో ఆదాయం తగ్గడంతో రైతు బంధు వేయాలా.. వద్దా..అనే ఆలోచనలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ ఒక్కటే మాట అన్నారు.. ఎవరికీ జీతాలు ఆపినా ఫర్వాలేదు కానీ రైతులకు ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఇవ్వాలని ఆదేశించారని చెప్పారు.
స్వయంగా సీఎం కేసీఆర్ రైతు అని.. రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టే వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు ఎంతో బాధలు అనుభవించారని.. నీళ్ల కోసం ఎన్నో బోర్లు వేసి..ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలై.. రోజుకు సుమారు ఐదు నుంచి ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. మంత్రి వివరిస్తున్నంత సేపు ఎంతో ఒపిగ్గా వింటూ వాహ్.. సీఎం కేసీఆర్ సాబ్‌నే బహుత్ బడియా కామ్ కియా.. అంటూ రైతులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత మనసున్న ముఖ్యమంత్రిని తామెప్పుడూ చూడలేదన్నారు. రైతుల కోసం ముఖ్యంగా మూడు కార్యక్రమాలు తీసుకున్నామని.. ఒకటి ఎకరాకు(సంవత్సరానికి) రూ.10 వేల చొప్పున రైతు బంధు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్… రైతు చనిపోతే రైతుబీమా ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఆరోగ్య పరిరక్షణ, ఫార్మా రంగంలో ప్రపంచంలోనే తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ఈ మేరకు రైతులకు వచ్చిన పలు సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో మహారాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా తమ వంతు కృషి చేస్తామని రైతు బృందం సభ్యులు తెలిపారు.
మహారాష్ట్ర కన్నా తెలంగాణ బాగుంది
మహారాష్ట్ర కన్నా తెలంగాణలో రైతు సంక్షేమం బాగుంది. మహారాష్ట్రలో ప్రాజెక్టుల నిర్మాణం సక్రమంగా లేవు. ఇక్కడ మాత్రం కేవలం మూడున్నరేళ్లలో నిర్మించడం గొప్ప విషయం. ఇక్కడ ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ తరహా దేశమంతా రైతు సంక్షేమం కోసం కృషి చేయాలి.
– లింగారెడ్డి, రైతు, నాందేడ్
రైతులు సంతోషంగా ఉన్నారు
కరువు కాటకాలతో మా ప్రాంతం అల్లాడుతున్నది. సాగునీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో మాత్రం ప్రాజెక్టుల నిర్మాణంతో నీటి నిలువలు పెరిగాయి. కరువు లేకుండా పోయింది. రైతులు సంతోషంగా ఉన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం బాగుంటుంది.
– రత్నమాల, మహిళా రైతు, పుణే