హనుమకొండ చౌరస్తా, మార్చి 18 : ఇటీవల హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ అర్చక సమాఖ్య తీవ్రంగా ఖండించింది. బుధవారం వరంగల్‌లోని విప్రబ్రాహ్మణ భవన్లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడారు. అన్ని వర్గాలు క్షేమంగా ఉండాలని నిత్యం పూజలు చేసే బ్రాహ్మణులపై అమర్యాదగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్ వెంటనే అసెంబ్లీలో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణిజం పట్ల అవగాహన లేని వ్యక్తులు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.
ఎస్సీ వర్గీకరణకు డాక్యుమెంట్ తయారు చేసిన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ కూడా బ్రాహ్మణుడేనని స్పష్టంచేశారు. భూసంస్కరణల చట్టం తీసుకొచ్చి పేద దళితులు, గిరిజనులకు భూములను పంచిన బ్రాహ్మణుడు పీవీ నరసింహారావు అని గుర్తుచేశారు. మందుల సామేల్ వెంటనే యావత్ బ్రాహ్మణజాతికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల ఐక్యతపై త్వరలోనే వరంగల్‌లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విప్ర బ్రాహ్మణ ఫౌండేషన్ అధ్యక్షుడు వల్లూరి పవన్‌కుమార్, భీమారం బ్రాహ్మణసంఘం అధ్యక్షుడు మోత్కూరి మనోహర్‌రావు, సురేశ్రావు, ధర్మేందర్రావు, చకిలం సుధాకర్‌రావు, కొండల్రావు, గణపతిశర్మ తదితరులు పాల్గొన్నారు.