సిద్దిపేట అర్బన్, మార్చి 14: నిన్న మాట ఇచ్చారు.. నేడు అమలు చేశారు.. అవును.. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు ఆలోచన వచ్చిందటే చాలు అది ఆచరణలోకి రావడం ఖాయం. దీనికి నిదర్శనమే మంగళవారం సిద్దిపేట గ్రంథాలయంలో చదువుకునే ఉద్యోగార్థులకు భోజనం ఏర్పాటు చేయడం. సోమవారం సిద్దిపేట పర్యటనలో భాగంగా మంత్రి హరీశ్‌రావు స్థానిక గ్రంథాలయాన్ని సందర్శించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులతో మంత్రి హరీశ్‌రావు కాసేపు ముచ్చటించారు.
గ్రంథాలయం ఎలా ఉపయోగపడుతుంది.. మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయా.. గతంలో ఆరు నెలల పాటు భోజనం పెట్టించా.. మళ్లీ భోజనం పెట్టిస్తా.. మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు, సిద్దిపేటకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మీరు బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతోనే ఇంత మంచి గ్రంథాలయం ఏర్పాటు చేయించానని.. రోజూ భోజనం కూడా పెట్టిస్తానని మంత్రి వారికి మాట ఇచ్చారు. 24 గంటల పాటు గ్రంథాలయంలో చదువుకోవచ్చని.. ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ మేరకు గ్రంథాలయంలో చదువుకునే ఉద్యోగార్థులు మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు ఇంత మంచి గ్రంథాలయం ఏర్పాటు చేయించడంతో పాటు భోజనం పెట్టి మాకు ఎంతో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారని యువతీ యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న చెప్పారు.. నేడు చేశారు..
సోమవారం రాత్రి గ్రంథాలయానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు రేపటి నుంచి భోజనం పెట్టిస్తా అని వారికి మాట ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం గ్రంథాలయ జిల్లా చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరామ్ భోజనం పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి హరీశ్‌రావు యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నేపథ్యంలో ఒక వైపు గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులోకి తేవడం.. మరోవైపు భోజనం పెట్టి వారిలో ఆత్మవిశ్వాసం నింపారని ప్రజాప్రతినిధులు తెలిపారు. రోజూ గ్రంథాలయంలో చదువుకునే 400 మంది యువతీ యువకులకు సొంత ఖర్చులతో భోజనం పెట్టి మరోసారి మంత్రి హరీశ్‌రావు మానవత్వాన్ని చాటుకుని ఆదర్శంగా నిలిచారు.