సదాశివపేట, ఏప్రిల్ 29: సదాశివపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. ఉదయం నుంచే లబ్ధిదారులతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొన్నది. శనివారం సదాశివపేట మున్సిపల్ పరిధిలోని సిద్దాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్స కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సదాశివపేట మున్సిపల్ పరిధిలో 350, మండలంలోని ఏడు గ్రామాల లబ్ధిదారులు 150 మంది మొత్తం 500 మందికి పట్టాలు అందజేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారమైందన్నారు. ఇల్లు రాని వారు నిరుత్సాహ పడొద్దని, త్వరలో ఇల్లు కట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 3లక్షలు ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు.
ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, భవిష్యత్తులో ప్రజలందరి అండదండలు తమ ప్రభుత్వంపై ఉండాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శరత్, జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో నగేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, ఎంపీపీ యాదమ్మ, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, కమిషనర్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, చీల మల్లన్న, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.