సర్కారు వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసి సమస్యల జబ్బు నుంచి విముక్తి కలిగించిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కృతజ్ఞత సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిదేండ్లలో వైద్యరంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి సాధించిందన్నారు. కరోనా సమయంలో ప్రపంచమంతా తలకిందులైతే.. ఆయుర్వేదం ఒక్కటే భరోసా ఇచ్చిందన్నారు. రెండో దశ కంటి వెలుగు కార్యక్రమంలో కోటి 70 లక్షల మందికి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేశారన్నారు.
– సిద్దిపేట అర్బన్, జూన్ 25
హైదరాబాద్ నగరం హెల్త్ హబ్‌గా మారింది. ఇక్కడ చికిత్స పొందేందుకు ఇతర రాష్ర్టాలు, విదేశాల నుంచి రోగులు వస్తున్నారు. తెలంగాణ రాకముందు 30 శాతం ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు 100 శాతం జరుగుతున్నాయి. ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కలిగించేలా ఆప్యాయంగా సేవలు అందించాలి. ఆయుర్వేద వైద్యాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వైద్యరంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఆయుష్ చికిత్సలో కూడా మొదటి స్థానంలో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం.
– ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట అర్బన్, జూన్ 25: తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేండ్లలో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కృతజ్ఞత సభకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యులకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో సేవలు అందించే ఒక గొప్ప అవకాశాన్ని తెలంగా ణ ప్రభుత్వం కల్పించిందన్నారు. మొత్తం 1154 మందికి ఎంఎల్‌హెచ్‌పీగా అవకాశం కల్పించామని.. మొత్తం 3071 మందిలో ఆయుష్ వైద్యు లు మూడో వంతు ఉన్నారన్నారు. 1987 సంవత్సరంలో రోజు వేతనంపై ఆయుర్వేద వైద్యుల భర్తీ జరిగితే.. 1999, 2006, 2011లో భర్తీ జరిగిందని.. ఈ నాలుగు సార్లు భర్తీ చేసినా.. మొత్తం 400 మందికి కూడా అవకాశం రాలేదని.. కానీ తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశం ద్వారా ఒకేసారి 1154 మందికి అవకాశం వచ్చిందని.. ఇది వైద్య చరిత్రలో గొప్ప మార్పుగా అభివర్ణించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం- ఆర్బీఎస్కేలో కూడా ఆయిష్ ద్వారానే ఎక్కువశాతం సేవలు అందుతున్నాయని తెలిపారు. కరోనా సమయంలో ప్రపంచమంతా తలకిందులైతే.. ఆయుర్వేదం ఒక్కటే భరోసా ఇచ్చిందన్నారు. అంతుచిక్కని మహమ్మారికి సంప్రదాయ వైద్యమే మందు అని.. ఎంతో మంది నమ్మి ఆచరించి.. ప్రాణాలు కాపాడుకున్నారని గుర్తు చేశారు.
ప్రభుత్వ ఆయుర్వేద ఫార్మసీ ద్వారా తయారు చేసిన జీవన్‌ధార అనే ఔషధాన్ని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిందన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో సోకిన బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రపంచాన్ని భయపెట్టిందని.. మందులు కూడా లేని సమయంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయుర్వే ద కళాశాల వైద్య బృందం ఎంతో పరిశోధించి.. బ్లాక్ ఫంగస్‌కు మెడిసిన్ కనుగొన్నారని.. ఇది తెలంగాణలో జరగడం మనందరికీ గర్వకారణమన్నారు. రెండో దశ కంటి వెలుగు కార్యక్రమంలో చాలా మంది కష్టపడి కోటి 70 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించేలా సేవలు అందించారన్నారు. క్వారైంటెన్ సెంటర్‌గా ఆయుష్కు సంబంధించిన నాలుగు దవాఖానలు (నేచురోపతి, టీబీ, బీఆర్కేఆర్, హోమియో)విశేష సేవలందించాయన్నారు. రెండు దఫాలుగా చేసుకున్న కంటి వెలుగు కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు కూడా మంచి సేవలు అందించారని.. వారందరికీ అభినందనలు తెలిపారు. వైద్యరంగంలో అగ్రస్థానం ఉన్న తెలంగాణ ఆయుష్ చికిత్సల్లో కూడా అగ్రస్థానంలో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. ప్రకృతి వైద్యం కోసం ఎంతో మంది ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి లక్షలు ఖర్చు చేసుకుంటున్నారని.. అలాంటి వారికి అతి తక్కు వ ఖర్చుకే ఉత్తమ వైద్యం అందించేందుకు నేచర్ క్యూర్ దవాఖానను రూ.10 కోట్లతో అంద ంగా, ఆకర్షణీయంగా అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు.
హెల్త్ హబ్‌గా హైదరాబాద్
హైదరాబాద్ నగరం హెల్త్ హబ్‌గా మారిందని.. ఇక్కడ చికిత్స పొందేందుకు ఇతర రాష్ర్టాల నుంచి, విదేశాల నుంచి పేషంట్లు వస్తుంటారని మంత్రి అన్నారు. ఆయుష్ వైద్యం పొందేందుకు సైతం విదేశాల నుంచి వచ్చే లా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రకృతి వైద్యానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా నిలిపేలా ప్రయత్నం చేస్తున్నామని.. ఇందులో మీ అందరి భాగస్వామ్యం కావాలన్నారు. సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, ఐదు కాలేజీలు, నాలుగు రీసెర్చ్ దవాఖానలు ఉన్నాయని తెలిపారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్దిపేటలో 50 పడకల కొత్త ఆయుష్ దవాఖాన నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. సిద్దిపేట మెడికల్ దవాఖానకు ఆయుర్వేద దవాఖానను అనుసంధానం చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఆయుర్వేద వైద్యాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని.. ఒకే గొడుగు కింద ఆయుర్వేద సేవలు తేనున్నామని చెప్పారు. అది విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. అన్ని జిల్లాలకు విస్తరించే ఆలోచన సీఎం చేస్తున్నారని తెలిపారు. అనంతగిరి హిల్స్‌లో జిందాల్ ఆయుర్వేద దవాఖానలో ఒక మంచి సెంటర్‌ను ప్రారంభిస్తామన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ వైద్యరంగంలో ఎంతో అభివృద్ధి సాధించిందని.. నీతి ఆయోగ్ ఇండెక్స్‌లో 2014లో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ, ఇప్పుడు 3వ స్థానానికి ఎగబాకిందన్నారు. కేరళ, తమిళనాడు తర్వాత స్థానంలో తెలంగాణ ఉందని.. తెలంగాణ మొదటి స్థానానికి చేరేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ప్రతి రంగంలో హబ్‌గా మారుతున్నదని.. ఫార్మా రంగంలో, వ్యాక్సిన్ ఉత్పత్తిలో, ఐటీరంగంలో, వైద్యరంగంలో కూడా తెలంగాణ హబ్‌గా మారిందన్నారు. ఇపుడు ఆయుర్వేదంలో కూడా హబ్‌గా మారుతుందన్నారు. ఆయుష్ సేవలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండాలని.. గతంలోలాగా కాకుండా ఇపుడు అన్ని వసతులు కల్పించామన్నారు. ఆయుర్వేద, యునానీ విషయంలో పక్క రాష్ర్టాలకు మందులు సరఫరా చేసే దిశగా చర్యలు చేపడుతామన్నారు.
ప్రజల్లో నమ్మకం కలిగించాలి
ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కలిగించేలా ఆప్యాయంగా వైద్యులు సేవలు అందించాలన్నారు. ఆయుష్ విషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలన్నారు. ప్రభుత్వ దవాఖానలో యోగా చేయిస్తున్నామని.. పల్లె దవాఖానలో గర్భిణుల సుఖ ప్రసవం కోసం యోగా చేయించాలని సూచించారు. సమాజ సేవలో భాగంగా వైద్యులు పని చేయాలని.. గర్భిణులకు ప్రభుత్వ పథకాలు, న్యూట్రిషన్ కిట్ గురించి వివరించాలన్నారు. ఎక్కువ మెటర్నిటీ మరణాలు ఉన్న పది దేశాల్లో మన భారతదేశం ఉండడం బాధాకరమన్నారు. ఇంత కాలం పాటు పరిపాలించిన పాలకులు ఏమి చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మెటర్నిటీ మరణాలు చాలా తగ్గాయని.. అనేక రకాలుగా చర్యలు తీసుకోవడం ద్వారానే ఇది సాధ్యమైందన్నారు.
తెలంగాణలో ఇపుడు వంద శాతం దవాఖానల్లో ప్రసవాలు జరుగుతున్నాయని.. తెలంగాణ రాకముందు 30 శాతం ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు 70 శాతం ప్రభుత్వ దవాఖానల్లో, 30 శాతం ప్రైవేట్ దవాఖానల్లో ప్రసవాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బంది సమీక్షలు నిర్వహిచడం ద్వారానే సత్ఫలితాలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో విశ్వ ఆయుర్వేద పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరంగపాణి, సమన్వయకర్త శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి కిషన్‌రెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.