గుంట జాగ ఖాళీలేకుండా పంటలు పండుతున్నాయని, ఇంతలా పొలాలు సాగవుతున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే సాధ్యమైందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నారాయణరావుపేట మండలంలోని బుగ్గ రాజేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో నిర్వహించిన బీఆర్ఎస్ మండల ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అనే అద్భుత దీపం వల్లనే రాదన్న తెలంగాణ వచ్చిందన్నారు. కానే కాదన్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అర కిలోమీటరు ఎత్తులో ఉన్న రంగనాయకసాగర్‌కు గోదావరి జలాలు తెచ్చామన్నారు. మండుటెండల్లో చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయని, కలలో కూడా ఊహించని పనులు జరుగుతున్నాయని తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
నారాయణరావుపేట/సిద్దిపేట, ఏప్రి ల్ 2 : ‘కార్యకర్తలకు కష్టమొస్తే.. నేను కాపాడుకుంటా.. మీ ఇంటిలో తండ్రి గా.. పెద్దన్నగా, తమ్ముడిగా.. కొడుకుగా.. మీవెంట ఉంటా.. మీరు లేకుంటే నేను లేను.. పార్టీ లేదు’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నారాయణరావుపేట మండలం బుగ్గరాజేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండు వేసవిలో చెరువులు మత్తడి దూకడం అనేది కల. ఆ రోజుల్లో బతుకమ్మలు వేయడానికి గుంతలు తీసి నీళ్లు పోసి వేసేవాళ్లమన్నారు. కలలో కూడా ఊహించలేని పనులు నేడు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ అనే అద్భుత దీపం వల్లనే రాదన్న తెలంగాణ వచ్చింది. కానే కాదన్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆర కిలోమీటర్ ఎత్తులో ఉన్న రంగనాయకసాగర్‌కు గోదావరి నీళ్లు తెచ్చుకున్నామన్నారు.
తెలంగాణ ఆంటే ప్రేమ కేసీఆర్‌కు గుండె నిండ ఉంటుంది. ప్రతి పక్షాలకు మాత్రం పెదవులపై మాత్రమే ఉంటుందన్నారు. కాంగ్రెస్ 40 ఏండ్ల నుంచి తాగు, సాగు నీరు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం దండగా అనే ప్రతిపక్షాలకు ప్రజల అండ దండలు లేవని విమర్శించారు. గతంలో రైతులు వాన కోసం ఆకాశం వైపు చూస్తే.. ఇవాళ కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు. మహారాష్ట్ర నుంచి 150 మంది రైతుల బృందం మన ప్రాజెక్టులు చూడడానికి వచ్చారని, దేశంలోని రైతులు నేడు కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు మహారాష్ట్రలోని షోలాపూర్‌లో 4 రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారన్నారు. తెలంగాణలో రోజూ మంచి నీళ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు.. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు తప్ప రైతులకు ఏంమిగులలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తప్ప 16 రాష్ర్టాల్లో మహిళలు బీడీలు తయారు చేస్తే ఎక్కడా పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం 16 వేల కోట్ల ఆదాని అప్పు మాఫీ చేసిందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతును ఎప్పుడు చిన్న చూపు చూడరన్నారు. రైతుల కోసం విద్యుత్‌ను కొనుగోలు చేసి ఉచితంగా ఇస్తున్నారన్నారు. వడ్లు కోనమంటే కేంద్రం చేతకాదు అంటుంది. ఆయిన సీఎం కేసీఆర్ ఉన్నాడని పండిన ప్రతి గింజనూ కోనుగోలు చేస్తాడని తెలిపారు. 30 ఏండ్ల నారాయణరావుపేట మండలం కలను కేసీఆర్‌ను సొంతం చేసుకున్నామన్నారు. అవార్డులు లేకుండా ఈ మండలం పేరు లేదన్నారు.
40 ఏండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ పట్టించుకోలేదన్నారు. గర్భిణులకు శక్తి నిచ్చేందుకు రెండు సార్లు ఇచ్చే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను ఈ నెల 16న ప్రారంభం చేస్తామన్నారు. కేసీఆర్ ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసం అభివృద్ధి చేస్తున్నారన్నారు. గతంలో గంజి కేంద్రాలు, ఆకలి కేంద్రాలు ఉండేవి.. నేడు లేవన్నారు. సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టుకొని గౌరవించామన్నారు. హైదరాబాద్‌లో 125ఫీట్ల ఎత్తున ఆంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం కేసీఆర్ పనిచేస్తే .. బీజేపీ కూల్చేస్తామని, కాంగ్రెస్ కుల్చేస్తామని చెపుతుందన్నా రు. సిద్దిపేట ట్యాగ్‌లైన్ జిల్లా గోదావరి నీళ్లు రైలు అన్నారు. ఇందులో జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీళ్లు తెచ్చుకున్నామని, మరో రెండు నెలల్లో సిద్దిపేటకు రైలు వస్తుందన్నారు. ప్రతి పక్షాలు మాట్లా డే మాటలు అన్ని అబద్ధాలు.. గ్లోబల్ మాటలన్నారు. ఇంటి అడుగు స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు ఇచ్చే కార్యక్రమం 15 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. నారాయణరావుపేట మండలం గులాబీ జెండాకు కంచుకోటన్నారు.
దేశంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే బీజేపీ ఏం చేస్తుందన్నారు. పేపర్ లీకేజీ ప్రతిపక్షాలు బయట పెట్టలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వమే గుర్తించిందన్నారు. దోషులపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. 80 వేల ఉద్యోగాలు 6 నెలల్లో భర్తీ చేస్తామన్నారు. ప్రతి పక్షాల మాటలు నిరుద్యోగులు నమ్మవద్దన్నారు. వారిని నమ్మితే నడి సముద్రంలో మునిగినట్టేనన్నారు. ఇంతటి మండుటెండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. ప్రతి కార్యకర్తకు అన్నగా, తండ్రిగా మీ ఇంట్లో కుటుం బ సభ్యుడిగా ఏ సమస్య ఉన్నా నేను అండగా ఉంటానని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ఆండగా ఉంటుందన్నారు. మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆందిస్తున్నట్లు తెలిపారు. మండలంలో రైతులకు ఆడిగిన వారికి కాదనకుండా స్పింక్లర్లు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ బాలకృష్ణ, మండలాధ్యక్షుడు కోనయగారి ఎల్లయ్య, జడ్పీటీసీ కుంబాల లక్ష్మీ రాఘవారెడ్డి, వైస్ ఎంపీపీ సంతోష్ కుమార్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు స్వప్నా ప్రభాకర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆంజనేయులు, యువజన విభా గం అధ్యక్షుడు భాస్కర్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు హాజరయ్యారు.
మానవతకు మారుపేరు సీఎం కేసీఆర్
– ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
మానవతకు మారుపేరు సీఎం కేసీఆర్.. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చి అమలు చేశారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తి, ఆ శిక్షణ నుంచి వచ్చిన వ్యక్తి మంత్రి హరీశ్‌రావు అని అన్నారు. తెలంగాణ వచ్చాక చెరువులను బాగు చేసి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి పెట్టుబడి సాయాన్ని సీఎం కేసీఆర్ ఇస్తున్నారన్నారు. ప్రజల్లో గొప్ప మార్పు కోసం తెచ్చిన ఏ పథకమైన ఉందో మోదీ చెప్పాలన్నారు. కేవలం ఆదాని.. అంబానీ లాంటి వాళ్ల కోసం పథకాలు తెచ్చాడన్నారు. రాముడు తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్యం వదిలి అడవులకు పోతే నేడు బీజేపీ రాముడి పేరు చెప్పుకొని రాజ్యాధికారం కోసం పనిచేస్తుందన్నారు.