యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 28: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం నిర్వహించిన శృంగార డోలారోహణంతో పరిసమాప్తమయ్యాయి. విష్వక్సేన పూజతో పుణ్యాహవచనం, హవన పూజలు చేసి పూర్ణాహుతి నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నారసింహుడిని 108 కలశాలతో వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య అభిషేకించారు. ప్రధానాలయ ముఖ మండపంలో 108 వెండి కలశాలు ఏర్పాటు చేసిన ప్రధానార్చక బృందం కలశాల్లో గంగ తదితర సప్తనదీ జలాలను, పంచామృతాలు, ఔషధాలతో నింపి దర్భ, మామిడి పత్రాలు, కొబ్బరికాయలు, పట్టు వస్ర్తాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవాయిద్యాల మధ్య గర్భాలయంలోని స్వయంభూమూర్తులు, సువర్ణ ప్రతిష్టామూర్తులకు అష్టోత్తర శత కలశాలతో అభిషేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అభిషేకమూర్తులు స్వామి, అమ్మవార్లను తులసి దళాలు, వివిధ రకాల పుష్పాలతో అర్చించి, క్షేత్ర మహత్మ్యాన్ని ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు తెలిపారు.
శృంగార డోలోత్సవం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11 రోజులు పాటు కొనసాగిన పూజా కైంకర్యాల్లో ఓలలాడిన కల్యాణమూర్తులు శ్రీలక్ష్మీనరసింహస్వామి పట్టు పీతాంబరాలు, ముత్యాలు, రత్నాల ఆభరణాలు, వివిధ రకాల పూలతో దివ్యమనోహరంగా అలంకరించి డోలికలో అధిష్టింపజేసి, డోలారోహణ నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ డైరక్టర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భవానీశంకర్, డీఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, మంగళగిరి నరసింహమూర్తి పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తాత్కాలికంగా నిలిపి వేసిన స్వామి, అమ్మవార్ల నిత్యతిరు కల్యాణోత్సవం, సుదర్శన నారసింహ హోమం ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.