పల్లెటూరి నుంచి వచ్చిన ఓ పేద అమ్మాయి కబడ్డీ ఆటలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా పేరు తెచ్చుకుంది..ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో ‘మహిళా కబడ్డీ’ సినిమాను రూపొందిస్తున్నామని, త్వరలో సెట్స్‌మీదకు తీసుకొస్తామని చెప్పారు చిత్ర దర్శకనిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్. స్వీయ నిర్మాణ సంస్థ ఆర్కే ఫిల్మ్స్ పతాకంపై ఆయన రూపొందిస్తున్న ఈ సినిమాలో ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, సుమన్, ఆక్సాఖాన్, తులసితో పాటు ఏడుగురు రియల్ కబడ్డీ ప్లేయర్స్ నటిస్తున్నారు.
శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర వివరాలను వెల్లడించారు. కబడ్డీ క్రీడను వృత్తిగా ఎంచుకునే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ఈ సినిమాలో తాను కీలక పాత్రను పోషిస్తుండటం ఆనందంగా ఉందని ఇండియన్ వుమెన్స్ కబడ్డీ ప్లేయర్ పూజ నర్వాల్ తెలిపారు. కబడ్డీ ఆటలో కూతురిని ఉన్నత స్థానంలో చూడాలని తపించే తండ్రి పాత్రను పోషిస్తున్నానని సీనియర్ నటుడు సుమన్ చెప్పారు.
దేశంలో క్రికెట్ తర్వాత కబడ్డీకే ఎక్కువ ఆదరణ ఉందని, స్ఫూర్తివంతమైన కథతో ఈ సినిమా తెరకెక్కనుందని కోచ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆమని, ఇంద్రజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రకాష్, సంగీతం: రాజ్‌కిరణ్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: ప్రతాని రామకృష్ణ గౌడ్.