వర్షాకాలం వచ్చేనాటికి పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, అన్నీ రోడ్ల బీటీ రెన్యువల్స్ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. మార్చి నెలలోపు ప్రారంభోత్సవానికి గజ్వేల్ రింగు రోడ్డు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో పీఆర్, బీటీ రెన్యువల్ ప్రగతి పనుల పురోగతిపై మంత్రి గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏప్రిల్ నెలాఖరులోగా అన్ని బీటీ రెన్యువల్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీకి సంబంధించి మొత్తం 26 పనుల్లో ఏ ఒక్కటీ ప్రారంభం కాకపోవడంపై మంత్రి అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయిల్‌పామ్ మొక్కలు సాగు-పురోగతిపైనా మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యవసాయ, ఆయిల్‌ఫెడ్, హార్టికల్చర్ అనుబంధ సంస్థలు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
సిద్దిపేట, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలోని రోడ్లు అద్దాల్లా మెరవాలి.. వర్షాకాలం ప్రారంభంలోపు పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, అన్నీ రోడ్ల బీటీ రెన్యూవల్స్ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. గజ్వేల్ రింగు రోడ్డు మార్చి నెలలోపు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంతరావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ సుదర్శన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులతో జిల్లాలో పీఆర్, బీటీ రెన్యువల్ ప్రగతి పనుల పురోగతిపై మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లాలో పంచాయతీరాజ్ ద్వారా 274 పనులు, ఆర్అండ్బీ ద్వారా 26 పనులు గుర్తించామన్నారు. జిల్లాలో ఏప్రిల్ నెలాఖరులోగా అన్ని బీటీ రెన్యువల్స్ నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆర్‌అండ్‌బీలో 26 పనులకు పనులేమీ ప్రారంభం కాకపోవడంపై ఆర్అండ్బీ అధికారుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటీ రోడ్ల రెన్యువల్స్‌పై నిర్లక్ష్యం వహిస్తే అధికార ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. 2022లో 299 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, వీటిలో ఎక్కువ రాజీవ్ రహదారి కలిసే ప్రాంతా ల్లో చోటుచేసుకున్నాయన్నారు. రోడ్ల ప్రమాదాల నివారణకు పంచాయతీరాజ్, ఆర్అండ్బీ ఇంజనీర్లు దృష్టి పెట్టాలని సూచించారు. రాజీవ్ రహదారిపై, లింకు రోడ్లు కలిసే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, స్మూత్ జాయినింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గజ్వేల్ రింగు రోడ్డు మార్చి నెలలోపు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. 55 కి. మీ నిడివి కలిగిన సిద్దిపేట రింగు రోడ్డు నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆర్అండ్బీ డీఈ బాలప్రసాద్‌ను ఆదేశించారు.
జిల్లాలో ఆయిల్ పామ్ మొక్కలు విరివిగా నాటాలి
జిల్లాలో ఆయిల్ పామ్స్ విరివిగా ఏర్పాటుచేయడమే లక్ష్యంగా జిల్లా వ్యవసాయ, ఆయిల్‌ఫెడ్, హార్టికల్చర్ అనుబంధ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికార యంత్రాంగంతో ఆయిల్ పామ్ మొక్కలు సాగు-పురోగతిపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయిల్ఫామ్ మొక్కలు నాటించే పూర్తి బాధ్యత ఏఈవోలదేనని స్పష్టం చేశారు. డ్రిప్స్ ఏర్పాటులో నిర్లక్ష్యం వహించే కంపెనీలను బ్లాక్ లిస్టులో పెడుతామని మంత్రి హెచ్చరించారు. ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్లు, సిబ్బంది ఆయిల్ఫామ్ మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగం నుంచి తొలిగిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా 8 వేల ఆయిల్ఫామ్ మొక్కలు నాటడం లక్ష్యమైతే, ఇప్పటికే 4500 మొక్కలు నాటడం పూర్తయిందన్నారు. మరో 1600 డీడీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటన్నింటినీ మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేయాలన్నారు. ఆయిల్ పామ్ సాగుకు పెద్ద రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్‌పామ్ మొక్క ఆరోగ్యంగా పెరిగేలా ఏఈవోలు, ఆయిల్‌ఫెడ్ అధికారులు తరుచూ పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలోని ఆయిల్ఫామ్ మొక్కలు నాటిన ప్రతి రైతులకు ఆయిల్‌ఫెడ్ ద్వారా డైరీలు అందించాలని మంత్రి సూచించారు.
అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలి
జిల్లా ప్రజల ఆర్థికాభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్లో గురువారం బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. బ్యాంకులు కమర్షియల్ టార్గెట్తోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చడంలో ముందుండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు, స్వయం సహాయక రుణాలు, ఈజీఎస్ పేమెంట్లు, ఇతర రకాల ఆర్థిక సహాయ కార్యక్రమాల కోసం ప్రభుత్వం అందజేసే నిధులను బ్యాంకర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దని స్పష్టం చేశారు. జిల్లాలో బ్యాంకుల కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో కొత్త బ్యాంక్ ఏర్పాటు చేయాలన్నారు.
వన్‌టైం సెటిల్మెంట్ కింద యూబీఐ, ఎస్బీఐ, ఏపీజీవీబీ, కెనరా బ్యాంకుల్లో గల పాత పంట రుణాలు, ఇతర బకాయిలు 50 నుంచి 80 శాతం రాయితీతో చెల్లించాలన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు రుణాలను త్వరగా అందించాలని చెప్పారు. పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు కొత్త రుణాలు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. స్వయం ఉపాధి రుణాలు త్వరగా అందించాలని సూచించారు. ఉన్నతి పథకం ద్వారా అర్హులైన ఉపాధి కూలీలకు నైపుణ్య శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి రుణాలు అందించాలని చెప్పారు. సిద్దిపేటలో 250 మంది మొబైల్, మెకానిక్‌లకు స్వయం ఉపాధి రుణాలను ముద్రా లోన్ అందించేందుకు ఎస్బీఐ ముందుకు రావడం అభినందనీయమని, ఇతర బ్యాంకులూ ముద్రా లోన్లు అందించాలని మంత్రి చెప్పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజాతోపాటు కలెక్టర్, అదనపు కలెక్టర్, సుడా చైర్మన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యజిత్, నాబార్డు ఏజీఎం, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు, మెప్మా, పరిశ్రమల శాఖ అధికారులతో పాటు మున్సిపల్ కమీషనర్లు ఉన్నారు.