మెదక్, (నమస్తే తెలంగాణ) / సిద్దిపేట కమాన్, ఫిబ్రవరి 3 : పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రత్యేక అధికారుల ద్వారా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక అన్నారు. శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ఇంజినీరింగ్ అధికారులతో పంచాయతీల అభివృద్ధిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇందులో భాగంగా ప్రత్యేక అధికారుల ద్వారా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.
కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మెదక్ కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రమేశ్, డీపీవో సాయి బాబు, జడ్పీ సీఈఓ శైలేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌లతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన సర్పంచ్ల పదవీకాలం ముగిసినందున 2వ తేదీ నుంచి అన్ని పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకున్నారని తెలిపారు. వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కార్యాచరణ రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు చేసేలా గ్రామీణ నీటి సరఫరా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుని, కూలీలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, నర్సరీల నిర్వహణ, మొకల సంరక్షణ, డంపింగ్ యార్డు, వైకుంఠధామాల అభివృద్ధికి సంబంధిత అధికారుల సమన్వయంతో ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈనెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పంచాయతీల్లో పారిశుద్ధ్యం పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, జడ్పీ సీఈవో రమేశ్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఎస్సీ శ్రీనివాస్‌చారి తదితరులు పాల్గొన్నారు.