సిద్దిపేట, జూన్ 1( నమస్తేతెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సాధనలో మెతుకుసీమ కీలకపాత్ర పోషించింది. ఉద్యమానికి ఊపిర్లూది రాష్ట్రం సిద్ధించే వరకు సబ్బండ వర్గాలు కేసీఆర్ వెంట నడిచాయి. అన్ని రంగాలు అభివృద్ధి సాధించాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమని రాష్ర్టాన్ని కేసీఆర్ చేతిలో పెట్టారు. కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో ఎంతో అభివృద్ధి సాధించింది. తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ సిద్దిపేట రంగధాంపల్లి ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. రాష్ట్ర సాధనలో సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమాలు, సకల జనుల భేరి, సడక్ బంద్, జైలుభరో తదితర కార్యక్రమాలకు జిల్లా వేదికైంది. సిద్దిపేట జిల్లా కేంద్రంతోపాటు నంగునూరు మండలం పాలమాకులలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. పాలమాకులలో వెయ్యి రోజుల పాటు దీక్షలు జరగ్గా, సిద్దిపేటలోని పాత బస్టాండ్ (మాడ్రన్ బస్టాండ్) వద్ద దీక్షలు జరిగాయి. చరిత్రలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్ర సాధన కోసం 42 రోజుల పాటు చేపట్టిన సకల జనుల సమ్మెతో పాలన స్థంభించింది. ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేట దీక్షా స్థలానికి చేరుకుంటున్న క్రమంలో పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించడంతో సిద్దిపేట ఆమరణ నిరాహార దీక్ష స్థలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.14ఎఫ్ రగడ.. తెలంగాణ ఉద్యమ దశను దిశను మార్చి ఉద్యమానికి నాంది పలికి ఒక ప్రభంజనంలా సృష్టించింది.
హింసకు తావులేకుండా, శాంతియుతంగా, గాంధేయ మార్గంలో పోరాడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు జనాన్ని కదిలించి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన ధీరుడు కేసీఆర్. ఆనాటి ఉద్యమ సమయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు ఇప్పటికీ జనాల హృదయాల్లో పదిలంగా ఉన్నాయి. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, హైదరాబాద్ నగరాన్ని ఆరోజోన్ నుంచి వేరుచేస్తూ ఫ్రీజోన్‌గా మార్చేందుకు తీసుకున్న నేపథ్యంలో కేసీఆర్ తీసుకున్న 14ఎఫ్ రగడ సంచలన నిర్ణయానికి నాంది పలికింది. అరవై ఏండ్లలో తెలంగాణ ప్రజలు అణిచివేతకు గురవుతున్న పరంపరలో ఫ్రీజోన్ వివాదం చిలికిచిలికి గాలివానగా మారి ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తెచ్చింది. ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేటలో ఫ్రీజోన్.. కాదురా.. హైదరాబాద్ మాదిరా.. పేరిట 14ఎఫ్‌కు వ్యతిరేకంగానిర్వహించిన ఉద్యోగ గర్జన భారీ బహిరంగ సభ కేసీఆర్ సంచలన నిర్ణయానికి వేదికైంది. తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి అయిన సిద్దిపేటలో తాను దీక్ష చేపడుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమ సారథి కేసీఆర్ ప్రకటనలతో జాతీయ, రాష్ట్రస్థాయిలో పెను సంచలనాలను సృష్టించాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, పెను మార్పులు ఎన్నో కీలక ఘట్టాలు ఆవిష్కరించాయి. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ సాధించేంత వరకు అదే స్ఫూర్తితో వేలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడి తెగించి కొట్లాడి తెలంగాణ వాదాన్ని బలపరుస్తూ అదే పంథాను కొనసాగించారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం యూపీఏ పరిణామాలు, ఉత్కంఠల నడుమ అఖిలపక్ష తీర్మానాలు చేయించి లోక్‌సభలో ఫిబ్రవరి 18న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. రాజ్యసభలో ఫిబ్రవరి 20న హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణకు ఆమోద ముద్ర వేశారు. ఈమేరకు మార్చి 1న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజముద్ర వేశారు. తదనంతరం తెలంగాణలో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో అదేరోజు తెలంగాణ ఉద్యమ రథ సారథి, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు.
ఉద్యమంలో బీఆర్ఎస్ ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొని ఉద్యమ ఉధృతి ఏ మాత్రం తగ్గకుండా ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి చరిత్రలో ఒక మైలురాయిగా నిల్చింది. 2005లో వరంగల్‌లో నిర్వహించిన జైత్రయాత్ర సభకు సైకిల్‌పై బయలుదేరిన కేసీఆర్ వెంట సైకిళ్లపై వందల మంది కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. 2006లో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాటతప్పడంతో ఆ పార్టీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. సిద్దిపేటలో శంఖారావం పేరిట బహిరంగ సభ నిర్వహించగా వివిధ ప్రాంతాల నుంచి లక్షల్లో ప్రజలు హాజరై మద్దతు తెలిపారు. తెలంగాణ కోసం మహాధర్నా పేరిట రాజీవ్ రహదారిని దిగ్బంధం చేశారు. సిద్దిపేట శివారులోని రాజీవ్ రహదారిపై జరిగిన కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. 2008లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించిన తర్వాత కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేస్తూ సిద్దిపేటలో హరీశ్‌రావు నాయకత్వంలో నిర్వహించిన ఉద్యోగ గర్జనకు భారీ స్పందన లభించింది. 2009 నవంబర్‌లో సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ వాలె జాగో.. ఆంధ్రా వాలె బాగో.. నినాదమిచ్చారు. ఆ తర్వాత నవంబర్ 9న పాపన్నపేట మండలంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై పద్మాదేవేందర్‌రెడ్డి, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆందోళనకు దిగారు. హరీశ్‌రావు, కేటీఆర్ తదితరులంతా పాల్గొని ఆందోళన ఉధృతం చేశారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఫ్రీ జోన్ రద్దుకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో కేసీఆర్ ఆమరణ దీక్షకు నిర్ణయించారు.
కేసీఆర్ నాయకత్వంలో మెతుకుసీమ ఎంతో అభివృద్ధి సాధించింది. పదేండ్లలో రూపురేఖలు మారాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరంతో గోదావరి జలాలను మెతుకుసీమకు తరలించారు. తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామాలను ఏర్పా టు చేసుకున్నాం. పాలనాపరమైన సంసరణలతో ప్రజాప్రయోజనాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. సువిశాలమైన కలెక్టరేట్లు, పోలీస్ కమిషనరేట్లు నిర్మించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు జిల్లాలో ఒక నీటిపారుదల ప్రాజె క్టు కూడా లేదు. చెరువులు అధ్వాన్నంగా కనిపించేవి. వాగులు, చెక్‌డ్యాంలను పట్టించుకున్నవాళ్లే లేరు. రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్లను అద్భుతంగా నిర్మించుకున్నాం. మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేసుకొని గోదావరి జలాలతో నింపుకున్నాం. ఆనాడు వానకాలంలో కూడా గుకెడు నీటికి కటకట ఎదురొన్న ప్రాంతాల్లో నేడు మండుటెండల్లో మత్తళ్లు దుంకుతున్నాయంటే అతిశయోక్తి కాదు. తాగునీటి కష్టాలు తీరాయి. కులవృత్తులను ప్రొత్సహించి, వారు స్వయం సమృద్ధి సాధించేలా అనేక పథకాలను కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చింది. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితో గ్రామాలు అద్భుతంగా తిర్చదిద్దబడ్డాయి. దేశంలో ఎకడా లేని విధంగా అర్హులైన అభాగ్యులందరికీ ఆపన్నహస్తం అందించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులతో పాటుగా ఎయిడ్స్, పైలేరియా, డయాలసిస్ బాధితులను కూడా అకున చేర్చుకొని పింఛన్లు అందజేసిన ఘనత కేసీఆర్‌కు దక్కింది.
ఉద్యమ సారథి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్దిపేటను ఎంచుకోవడంతో తెలంగాణ వాదుల పిడికిలి బిగింశారు. కేసీఆర్ దీక్షను సవాల్‌గా తీసుకున్న ఎమ్మెల్యే హరీశ్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి, దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి తో కలిసి రంగధాంపల్లి అమరవీరుల స్థూపం సమీపంలో దీక్షా శిబిరం వేదిక ఏర్పాట్లను ముమ్మరం చేశారు. వేలాదిగా తరలివచ్చే ఉద్యమకారులు కూర్చునేందుకు వీలుగా విశాలమైన ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఆమరణ దీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ను నవంబర్ 29న కరీంనగర్ శివారులో పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం తరలించగా సిద్దిపేట దీక్షాస్థలి వద్ద హరీశ్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి తదితర నాయకులు దీక్షకు సిద్ధమయ్యారు. దీక్షా స్థలిని పోలీ సులు అణిచివేయడంతో ఉద్యమం ఉధృతమైంది. ఒకవైపు కేసీఆర్‌ను ఖమ్మం జైలుకు తరలించడంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. దీంతోజిల్లా విద్యార్థి లోకం లేచింది. జిల్లా విద్యార్థి విభాగం నాయకులు విద్యార్థులను చైతన్యపర్చేందుకు విస్తృతంగా విద్యార్థి గర్జన పేరిట సదస్సులు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో ఉద్యమంలో భాగంగా జాతీయ రహదారిపై ధర్నాలు, రైలురోకోలు, రోడ్లపై వంటావార్పు, రోడ్ల దిగ్బంధం తదితర కార్యక్రమాలు ఉధృతంగా నిర్వహించారు. 42 రోజులపాటు జరిగిన సకల జనుల సమ్మెలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. హరీశ్‌రావు నేతృత్వంలో ఉమ్మడి జిల్లాలో 132 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు.