గజ్వేల్, మే 20: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన 14 గ్రామాల ప్రజలకు గజ్వేల్ సమీపంలోని సంగాపూర్-ముట్రాజ్‌పల్లి గ్రామాల మధ్య 600ఎకరాల విస్తీర్ణంలో సుమారు 2273 డబుల్ బెడ్రూం ఇండ్లను బీఆర్ఎస్ హయాంలో నిర్మించి ఆయా గ్రామాల బాధిత కుటుంబాలకు అందజేశారు. మరికొద్ది మందికి ఓపెన్ ప్లాట్లు ఇచ్చారు. గతేడాది సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ఆయా గ్రామాలకు ప్రత్యేకాధికారులను నియామించారు. కొద్ది రోజుల వరకు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలోనే గ్రామాల్లో పారిశుధ్య, తదితర పనులు చేపట్టారు. కొద్ది రోజుల క్రితం ముంపు గ్రామాలను తొగుట, కొండపాక మండలాల నుంచి వేరుచేసిన అధికారులు, గజ్వేల్ మున్సిపాలిటీలో విలీనం చేయకపోవడంతో ప్రస్తుతం తమ అడ్రస్ ఎక్కడ అంటూ ముంపు గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అటు ఇటు కాకుండా..
ముంపు గ్రామాలను తొగుట, కొండపాక మండలాల నుంచి తొలిగించిన అధికారులు ఆయా గ్రామాలను అధికారికంగా ఎక్కడ చూపించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తమ అడ్రస్ ఎక్కడ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ముంపు గ్రామాలను కలుపుతున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముంపు గ్రామాల్లో పనిచేసిన పంచాయతీ అధికారులను ఇతర మండలాలకు బదిలీ చేశారు. దీంతో ఆయా గ్రామాల పర్యవేక్షణ గాలిలో దీపంలా మారింది. అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యలను పరిష్కరించే వారు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఐదు నెలలుగా పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి వేతనాలు చెల్లించకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. అటు తొగుట, కొండపాక మండలాల్లో కాకుండా, ఇటు గజ్వేల్ మున్సిపాలిటీలో విలీనం చేయలేదు.
బీఆర్ఎస్ హయాంలో పునరావాసం
ఆర్అండ్ఆర్ కాలనీలోని ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 1253, లక్ష్మాపూర్‌లో 388, వేములఘాట్‌లో 1252, పల్లెపహాడ్‌లో 921, రాంపూర్‌లో 320, బ్రాహ్మణ బంజేరుపల్లిలో 267, ఎర్రవల్లిలో 800, సింగారంలో 330కి పైగా ముంపు కుటుంబాలు ఉండగా, వీరి కోసం 2273 డబుల్ బెడ్రూం ఇండ్లను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించి ఇచ్చింది. ఆయా గ్రామాల్లో వ్యవసాయ భూమితో పాటు ఇతర ఆస్తులకు పరిహారం ఇవ్వడం, ప్రతి కుటుంబానికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.7.50 లక్షలు, ఇల్లు అందజేశారు. ఇల్లు వద్దనుకున్న వాళ్లకు ఓపెన్ప్లాట్తో పాటు రూ.5.04లక్షలు అందజేశారు. 18 ఏండ్లు నిండిన మగవారికి ఓపెన్ ప్లాట్, అమ్మాయిలకు పరిహారం చెక్కులు అందజేశారు.
ఎక్కడి సమస్యలు అక్కడే..
ఆర్అండ్ఆర్ కాలనీలో నెలకొన్న చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా అధికారులు కాలనీలో పర్యటించిన సందర్భంలో అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని సమాధానం చెప్పి ఆ తర్వాత కాలయాపన చేస్తున్నారు. కాలనీలోని డ్రైనేజీలపై స్లాబ్‌లు విరిగిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారాయి. డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో మట్టితో నిండిపోయాయి. కాలనీలో మిగిలిన కొద్దిపాటి మందికి ప్యాకేజీ, ప్లాట్లను ఇవ్వడంతో పాటు ముంపు గ్రామాల కోసం తక్షణమే శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.