రామాయంపేట, మే 13 : విద్యార్థులు వేసవి శిక్షణలో యోగా, ధ్యానం తదితర వాటిని నేర్చుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగి మంచి చదువులు చదివితేనే ముందుకు వెళ్తారని రామాయంపేట మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న వేసవి శిక్షణ శిబిరానికి విచ్చేసి విద్యార్థులకు ఆట పాటలపై, కథలు, యోగా, ధ్యానం, ప్రాణాయామం, ఆసనాలు, చిత్రలేఖనం, పొడుపు కధలు, షటిల్, వాలీబాల్, క్యారమ్స్ తదితర క్రీడల్లో నైపుణ్యం సాధించాలని అప్పుడే సమాజంలో పేరు ప్రతిష్టలు దక్కుతాయన్నారు.
శిక్షణలో భాగంగా విద్యార్థులతో ద్యానం, ఉపన్యాస, వ్యాసరచన, క్రీడా పోటీలలో పాల్గొనేలా శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి రోజు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఉదయం 8గంటల నుండి 11గంటల వరకు శిక్షణ ఉంటందన్నారు. అనంతరం 11గంటలకు విద్యార్థులకు స్నాక్సును అందించి ఇంటికి పంపిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీటీఐలు మల్లేశం, కవిత, యోగా గురువు భరత్, డ్రాయింగ్ టీచర్ యాదమ్మ తదితరులున్నారు.