Medak | మెదక్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ప్రాణాలైనా ఇస్తాం.. సెల్ టవర్ను వేయనీయమని స్థానికులు తేల్చిచెప్పారు. ఎయిర్టెల్ సంస్థ నిర్వాహకులు మెదక్ పట్టణంలోని నర్స్ఖేడ్ కాలనీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భీష్మించుకుని కూర్చున్నారు.
ఈ సందర్బంగా మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కండేల నర్సింలు మాట్లాడుతూ.. సెల్ టవర్ విషయమై గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నామని తెలిపారు. అధికారులను కలిసి మా కాలనీలో సెల్ టవర్ నిర్మాణం చేయొద్దంటూ పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. టవర్ వేస్తే దాని ద్వారా వచ్చే రేడియేషన్తో కాలనీ ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కంపెనీ నిర్వాహకులు పోలీసులను పెట్టి మరీ సెల్ టవర్ ఏర్పాటు చేయించడం తగదని అన్నారు.
టవర్ ఏర్పాటు విషయమై స్థానికంగా ఉన్న ఎంపీ రఘునందన్ రావు దృష్టికి స్థానికులు తీసుకెళ్లారని తెలిపారు. వెంటనే స్పందించిన ఎంపీ ప్రజామోదానికి వ్యతిరేకంగా పనిచేయొద్దంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. సెల్ టవర్ పనులు వెంటనే నిలిపివేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు చింతల రమేశ్, వనం యేసయ్య, కండేలా రాములు, గంగాధర్, గోపయ్య, పాపయ్య, పోచయ్య, నాగరాజు, నవీన్, దాసు, సూరి, యేసులతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.