మెదక్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవులు చిచ్చురేపాయి. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి తొలి విడుతలోనే షాక్ తగిలింది. కార్పొరేషన్ చైర్మన్ పదవుల కేటాయింపులో న్యాయం జరగలేదని సీనియర్లు అసంతృప్తిలో ఉన్నారు. ఇంతకాలం పార్టీకి వెన్నంటి ఉన్నా, తమకు తగిన గౌరవం దక్కలేదని ఆవేదన చెందుతున్నారు. సోమవారం రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవుల కేటాయింపు తర్వా త సీనియర్ నాయకులు నారాజ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ గెలుపు కోసం పనిచేస్తే మంచి అవకాశాలు ఉంటాయని నేతలు ఇచ్చిన హామీల ప్రకారం తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాత మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోకవర్గాలకు చెందిన నేతలు నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతవరకు ఒక్కరికీ కూడా పదవి దక్కలేదు.
తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవుల్లో మెదక్ జిల్లాకు మొండిచేయి చూపించారు. మెదక్ నియోజకవర్గం నుంచి రామాయంపేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుప్రభాత్రావు, పల్లె రాంచందర్ గౌడ్, ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎలక్షన్‌రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సుహాసినిరెడ్డితోపాటు ఇంకా పలువురు సీనియర్లు నామినేటెడ్ పదవుల కోసం వేచి చూస్తున్నారు.
పార్టీని నమ్ముకున్న వారికి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధిష్టానాన్ని వేడుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది నాయకులు సీఎం రేవంత్‌రెడ్డిని, జిల్లా మంత్రులను కలుస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ప్రకటించిన వెంటనే కొందరు నాయకులు హైదరాబాద్‌లో ముఖ్య నేతలను కలుస్తున్నారు. పదేండ్లపాటు కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవుల్లో అన్యాయం చేయవద్దని ఒత్తిడి తెస్తున్నారు. ఇదిలావుండగా మార్కెట్ కమిటీ పాలకవర్గాల పదవుల్లో కూడా తీవ్రమైన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లాలో కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎవరిని వరించనున్నాయో వేచిచూద్దాం..