సిద్దిపేట, జనవరి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎద్దు ఏడ్చిన ఎవుసం..రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం అదే జరుగుతున్నది.కాంగ్రెస్ ఏడాది పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి. నాటి సమైక్య రాష్ట్ర నాటి పరిస్థితులు దాపురించాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు జరిగాయి. సాగుకు కాంగ్రెస్ సర్కార్ చేయూత కరువు కావడంతో రైతన్న రంది చెందుతున్నాడు. ప్రభుత్వం పెట్టుబడి సాయం ఎగ్గ్గొట్ట్టింది..రుణమాఫీ అసంపూర్తిగా చేసింది. రైతుబీమా రావడం లేదు.
రైతులకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. పంటలకు తెచ్చిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. అప్పులు తీర్చే మార్గం లేక తనలో తాను రైతు కుమిలిపోయి చావే శరణ్యం అంటున్నాడు. ఏడాది కాంగ్రెస్ పాలనలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో 96 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు పిట్టల్లా రాలిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. నాడు కేసీఆర్ ప్రభుత్వం రైతుకు దన్నుగా నిలిచింది. సకాలంలో రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం అందించింది.
ప్రాజెక్టుల ద్వారా సీజన్‌కు ముందే సాగునీరు అందించింది. 24గంటల కరెంట్ సరఫరా చేసింది. రైతుబీమాతో ధీమా కల్పించింది. గ్రామంలోనే సెంటర్లు ఏర్పాటు చేయించి మద్దతు ధరకు ధాన్యం కొని అండగా నిలిచింది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితులు లేక పోవడంతో రైతు ధైర్యాన్ని కోల్పోతున్నాడు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ నియమించిన రైతు కమిటీ ఉమ్మడి మెదక్ జిల్లాలో త్వరలో పర్యటించి రైతులకు ధైర్యాన్ని నూరిపోయనున్నది.
రేవంత్‌రెడ్డి సర్కారు వచ్చాక ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. ఇటీవల బీఆర్ఎస్ విడుదల చేసిన జాబితా ప్రకారం, క్షేత్రస్థాయిలో వాస్తవంగా రైతుల ఆత్మహత్యల వివరాలను చూసుకుంటే మెదక్ జిల్లాలో 62 మంది , సిద్దిపేట జిల్లాల్లో 20 మంది, సంగారెడ్డి జిల్లాలో 14 మంది, మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 96 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రోజుకో రైతు తనువు చాలిస్తున్నాడు. ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట ముంచిది. రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా చేయలేదు. దీంతో చాలామంది రైతులు బ్యాంకుల్లో మిత్తిలు కట్టలేక అప్పుల పాలవుతున్నారు.
రెండు లక్షల పైన ఉన్న డబ్బులు కట్టుమంటే వాటిని కట్టారు. తీరా కట్టాక రెండు లక్షల రూపాయల రుణమాఫీని కాంగ్రెస్ సర్కార్ మరిచి పోయింది. దీంతో బ్యాంకులో ఉన్న అప్పుకు తోడు.. బ్యాంకు మిత్తి కట్టడానికి తెచ్చిన డబ్బులకు వడ్డీ తడిసి మోపెడు అయ్యాయి. దీంతో రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. పంట పెట్టుబడి సాయం రావడం లేదు. సాగుకు ముందు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారు. పంట చేతికి వచ్చే సరికి పంట సాగుకు చేసిన ఖర్చు, వడ్డీకి తెచ్చిన అప్పలు, వాటికి మిత్తి అన్ని కలిపి పంట మొత్తం వాటికే పోతున్నది. రైతులకు కష్టం మాత్రమే మిగులుతోంది. దీంతో ఆత్మైస్థెర్యం కోల్పోయి రైతులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
కాంగ్రెస్ ఎన్నికల ముందు రైతులకు రైతుభరోసా కింది ఎకరానికి ఎటా రూ. 15 వేలు ఇస్తానని చెప్పి రెండు పంటలకు ఎగ్గ్గొట్టింది. కేసీఆర్ ప్రభుత్వంలో ఠంచన్‌గా పంట సాగుకు ముందే రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ఎకరానికి రూ. 5వేల చొప్పున, ఏటా రెండు పంటలకు రూ.10 వేల చొప్పున పంట సాయం అందించింది. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన నాటి నుంచి ఆ డబ్బులు రావడం లేదు. ఇప్పటికి రెండు పంటల రైతుభరోసా డబ్బులను రైతులకు కాంగ్రెస్ బాకీ పడింది.
రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసింది. అన్ని పంటలకు బోగస్ అని చెప్పి బోగస్ చేసింది. రైతులు యాసంగిలో పంట వేయడానికి వెనకా ముందు ఆలోచన చేయల్సిన దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు నమ్మకం లేక యాసంగిలో సగం భూముల్లో సాగుచేయలేదు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వా ల్సి ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం సరిగా ఇవ్వడం లేదు. జనవరి చివరి మాసంలోనే కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యా యి. వెరసి రైతులకు కాంగ్రెస్ పాలనలో అన్ని కష్టాలే దాపురించాయి.