మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 28 : మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో వివిధ పథకాల కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. మెదక్‌లో నిర్మిస్తున్న వైకుంఠధామం, జంతు సంరక్షణ కేంద్ర భవనాలకు టైల్స్ పెయింటింగ్ వంటి ముగింపు దశలోని స్ట్రీట్ వెండర్ మార్కెట్‌ను మే 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రారంభానికి అర్బన్ హోం సెంటర్‌ను సిద్ధం చేయాలని, జంతు వధశాల శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల్లో వేగం పెంచాలన్నారు.
పట్టణంలోని చిల్డ్రన్ పార్క్‌కు స్థలం సేకరించాలని తహసీల్దార్‌కు సూచించారు. పట్టణ ప్రగతి కింద 13 రకాల పనులకు సంబంధించి టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రామాయంపేట మున్సిపాలిటీలో జరుగుతున్న పనులను సమీక్షిస్తూ మున్సిపల్ భవన నిర్మాణానికి డిజైన్ ఫైనల్ చేస్తూ పనులు చేపట్టాలన్నారు. వివిధ వార్డుల్లో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కమిషనర్‌కు సూచించారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠధామం పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్లు జానకీరాంసాగర్, ఉమాదేవి, పీఆర్ ఈఈ సత్యనారాయణరెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రతాప్, డీప్యూటీ ఈఈ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.