మెదక్, జూన్ 4(నమస్తే తెలంగాణ): రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, రైతుల పండించిన ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకుఎ మెదక్ జిల్లాలో 71, 327 మంది రైతుల నుంచి 3,50,620 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 57,496 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 616. 93 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 200 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేసినట్లు తెలిపారు.
ధాన్యం కొనుగోలు పూర్తి చేసిన కేంద్రాల్లో పనిచేసిన హమాలీలు, లారీలను ధాన్యం పూర్తి కాని కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వేగవంతంగా అన్లోడ్ చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు, మిల్లర్లు సమన్వయంతో వడ్ల సేకరణ వందశాతం పూర్తిచేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు, డీఎస్వో నిత్యానంద తదితరులు పాల్గొన్నారు.