సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 9: కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానిక రామచంద్రారెడ్డి కాలనీవాసులు అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వినతులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో 79 మంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీలు అందజేశారు. అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి కాలనీవాసులు ప్రభుత్వ స్థలాన్ని కాపాడలని కోరుతూ అర్జీ పెట్టుకున్నారు. సర్వే నెంబర్ 403లో ఆట స్థలం, అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం ఈ స్థలం కేటాయించిందని, కొందరు ఈ భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు.
అనంతరం అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. సమస్యల పరిష్కారం క్షేత్ర స్థాయి నుంచి జరిగితే త్వరితగతిన పూర్తవుతాయన్నారు. సమస్య పరిష్కారం కానట్లయితే అందుకు గల కారణాలు వివరంగా అర్జీదారులకు తెలుపాలన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా ప్రజావాణి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ప్రజావాణికి అందిన అర్జీల్లో రెవెన్యూ సంబంధిత సమస్య, డబుల్ బెడ్రూం, పింఛన్ తదితర ఉన్నాయి. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ఏవో తదితరులు పాల్గొన్నారు.
అర్జీలను త్వరగా పరిష్కరించాలి
మెదక్ అర్బన్, జనవరి 9: అర్జీదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. చిన్నశివునూర్ గ్రామానికి చెందిన చందు సాహెబ్ ఫిర్యాదు ప్రకారం.. అదే గ్రామ శివారు సర్వే నెంబర్ 380లో అతడి తండ్రి పేర 15.29 ఎకరాల భూమి ఉన్నది. అతడి తండ్రి మృతిచెందిన తర్వాత వేరే వాళ్లు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదీకి తగిన న్యాయం చేయమని రామాయంపేట సీఐకి ఎస్పీ సూచించారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన గోరేబి ఫిర్యాదు ప్రకారం.. తన చిన్న కొడుకు తనను ఇంట్లో ఉండనీయకుండా బయటకు వెళ్లగొట్టాడని, దీంతో ఎక్కడ ఉండాలో తెలియడం లేదని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా, చట్ట ప్రకారం ఫిర్యాదీకి తగిన న్యాయం చేయాలని నర్సాపూర్ సీఐకి సూచించారు.
సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
మెదక్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని మెదక్ ఆర్డీవో సాయిరాం అన్నారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణిలో 49 ఫిర్యాదులు వచ్చాయని, అందులో నాలుగు ఫిర్యాదులు డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం, మిగతావి వివిధ సమస్యలపై ఆర్జీలు ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్వో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.