మెదక్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ మెదక్, నర్సాపూర్‌లో నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అంచనాకు మించి ప్రజలు భారీగా తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. బస్సులు, ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, ట్రాలీలు, బైకుల్లో ప్రజలు భారీగా తరలివచ్చారు. సీఎం రాకముందే సభా ప్రాంగణాలు మొత్తం జనంతో నిండిపోయాయి. మెదక్ జిల్లాలో గులాబీ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. కారు టాప్ గేర్‌లో లక్ష్యం వైపు పరుగులు పెడుతున్నది.
మెదక్ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల కదన రంగంలోకి దిగి జనంలోకి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా, అప్పటి నుంచే గులాబీ అభ్యర్థులు రంగంలోకి దిగారు. నిత్యం జనంతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమను ఆశీర్వదిస్తే రాబోయే ఐదేండ్లలో నియోజకవర్గాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ మద్దతు కూడగడుతున్నారు. మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలకు మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతారెడ్డిని అభ్యర్థులుగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో వారు జనక్షేత్రంలోకి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఈ నెల 15న మెదక్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభతో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి హ్యాట్రిక్ విజయం పక్కా అయ్యింది. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన ఆమె మెదక్ నియోజకవర్గ రూపురేఖలు మార్చారు. మునుపెన్నడూ లేనివిధంగా మెదక్ సభకు జనం పోటెత్తడంతో పద్మ గెలుపు ఖాయమైంది. ఈ జనాన్ని చూస్తుంటే మెదక్ జిల్లా సభలా అనిపించింది. ఇంత పెద్దఎత్తున జనం వచ్చి పద్మాదేవేందర్‌రెడ్డిని ఆశీర్విదించారు. ఇక ఆమె భారీ మెజార్టీతో గెలిచినట్టే లెక అంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో మెదక్ నియోజకవర్గ గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మ్యాడం బాలకృష్ణ, బీజేపీ నుంచి నందు జనార్దన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక పద్మాదేవేందర్‌రెడ్డి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నర్సాపూర్‌లో సీఎం సభ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి గెలుపు నలేరుపై నడక అన్నది స్పష్టం అవుతున్నది. జిల్లాలో రెండు స్థానాలు కైవసం చేసుకుని తీన్మార్ మోగించబోతున్నది. ఎకడ చూసినా ప్రచార కార్యక్రమాలతో గులాబీ శ్రేణుల అభ్యర్థులు గ్రామాలను చుట్టేస్తుంటే, విపక్ష పార్టీల్లో ఆ సందడి కనిపించడంలేదు. నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డికి తోడుగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఉపాధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి గాలి అనిల్‌కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేశ్‌నాయక్ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడంతో బీఆర్ఎస్కు అదనపు బలం చేకూరింది. ఇప్పటికే నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు హరికృష్ణతో పాటు పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ రాకతో గులాబీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. పార్టీ శ్రేణులు, అభిమానులు కాలినడకన సైతం కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు పోటెత్తారు. కార్యకర్తలు, అభిమానులు సొంత ద్విచక్ర వాహనాలు, సొంత వాహనాల్లో వచ్చి కేసీఆర్‌కు జేజేలు పలికారు. మరోపక మెదక్, నర్సాపూర్ సభలు ఊహించిన దానికంటే సూపర్ సక్సెస్ అయ్యాయి. రైతుబంధు ఎకరానికి రూ.16 వేలకు వచ్చే ఐదేండ్లలో క్రమంగా పెంపు, సౌభాగ్యలక్ష్మి పేరుతో బీపీఎల్ కుటుంబాలకు చెందిన అర్హులైన మహిళలకు కొత్తగా నెలకు రూ.3వేల గౌరవ భృతి, అర్హులైన పేద కుటుంబాలు, అక్రిడెటెడ్ జర్నలిస్టులకూ రూ.400కే వంట గ్యాస్ సిలిండర్, కేసీఆర్ ఆరోగ్యరక్ష ద్వారా రూ.15 లక్షలు, జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు నగదు రహిత వైద్యబీమా, పేద కుటుంబాలకు రూ.5 లక్ష ల కేసీఆర్ బీమా, సన్నబియ్యం, రూ.5016కు ఆసరా పింఛన్లను పెంపును మార్చి నుంచి దశల వారీగా అమలు చేస్తామని సభలో కేసీఆర్ ప్రకటించగానే ప్రజలు జేజేలు కొట్టారు.