సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 1: సింగూర్ ముంపు భూముల్లో జరుగుతున్న అక్రమాలను మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే భూ అక్రమాలపై ఫిర్యాదు చేశారు. సింగూర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు, ఎఫ్టీఎల్ భూముల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఖదిరాబాద్, సైపేట్ గ్రామాల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో చెరువుల ధ్వంసం, ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రాజెక్టు మరమ్మతుల కోసం నీటిని ఖాళీ చేసిన నేపథ్యంలో ఇదే అదనుగా మంత్రి దామోదర రాజనర్సింహ బావమరిది అనిల్‌రెడ్డి, అతడి అనుచరులు వందల ఎకరాల్లో ప్రభుత్వ, ముంపు భూములను ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖాదిరాబాద్ గ్రామ పరిధిలోని కొరివికుంట, నల్లకుంట చెరువులను భారీ యంత్రాలతో పూర్తిగా ధ్వంసం చేశారని, వాటి కట్టలు, తూములు తొలిగించి ఆనవాళ్లు లేకుండా చేశారని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోని దాదాపు రెండు ఎకరాల భూమిని ఆక్రమించి మట్టితో నింపి ప్రైవేట్ రిసార్టులు, బోటింగ్ వ్యాపారుల కోసం సమానంగా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.
పేదల భూములను ఆక్రమించుకోవడంతో పాటు తమ పొలాల్లోకి రైతులు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో అనుమతులు లేకుండా విద్యుత్ లైన్లు కూడా ఏర్పాటు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ, నీటిపారుదలశాఖల అధికారులతో సంయుక్తంగా సర్వే చేయించి ఎఫ్టీఎల్ హద్దులు నిర్ధారించాలని కలెక్టర్‌ను కోరారు. అక్రమాలను వెంటనే నిలిపివేయాలని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ధ్వంసమైన చెరువులను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.