పాపన్నపేట, సెప్టెంబర్ 28: విస్తారంగా కురుస్తున్న వానలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరద ఉధృతికి మెదక్ జిల్లా ఏడుపాయల సమీపంలోని ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతున్నది. ఆదివారం 1,24,598 క్యూసెక్కుల వరద ఈ ఆనకట్ట నుంచి దిగువకు ప్రవహించాయి. వరద తీవ్రతకు ఏడుపాయల ఆలయం ఎదుట క్యూలైన్లు, షెడ్డు రేకులు కొట్టుకుపోయాయి. ఆలయాన్ని ముంచెత్తుతూ సమీపంలోని యాగశాల నుంచి మంజీరా వరద పోటెత్తింది.
ఘనపురం ప్రాజెక్టు దిగువన గల మొదటి బ్రిడ్జి, ఎల్లాపూర్ బ్రిడ్జి నీట మునిగాయి. రెండు రోడ్లను మూసివేయడంతో పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల ప్రజలు మెదక్ వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. మంజీరా నది వైపు ఎవరూ వెళ్లకుండా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంజీరా వరద ఉధృతికి పాపన్నపేట మండలంలో సుమారు వెయ్యి ఎకరాల పైగా వరి పంట నీట మునిగింది. దీంతో రైతులు చింతిస్తున్నారు. ఎంకెపల్లి, చిత్రియాల్, గాజులగూడెం, కొడుపాక, నాగ్సాన్పల్లి, ఎల్లాపూర్, గాంధారిపల్లి, కొత్తపల్లి, యూసూఫ్పేట్, ఆరెపల్లి, మిన్పూర్ ముద్దాపూర్, రామతీర్థం, మల్లంపేట, కందిపల్లి, చీకోడ్ తదితర గ్రామా ల్లో పంటలు నీట మునిగాయి. పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.