Shubham Vaidkar : ఇంజినీర్‌గా ఒకప్పుడు మూడున్నర లక్షల వార్షిక వేతనం అందుకున్న ఒక యువకుడు ఇప్పుడు ఒక రోజుకు రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. తనకిష్టమైన రంగంలో రాణిస్తూ.. విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాడు. కెరీర్ అంటే.. చదువు, మార్కులు, డిగ్రీలు, ట్రెండ్ మాత్రమే కాదు.. ప్యాషన్.. ఆ మాటకొస్తే ఫ్యాషన్ కూడా అని నిరూపిస్తున్నాడు ముంబైకి చెందిన శుభం వైద్కర్.
24 ఏళ్ల శుభం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న మోడల్. ఒక్క రోజు పనికి లక్షల్లో ఛార్జ్ చేస్తున్నాడు. దీని వెనుక అతడి పట్టుదల, శ్రమ చాలా ఉంది. ముంబైలోనే పుట్టిపెరిగిన అతడు చాలామందిలాగానే ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఇదే సమయంలో అతడికి మోడలింగ్ అంటే ఆసక్తి ఉండేది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు సరదాగా మోడలింగ్ చేసేవాడు. కానీ, పూర్తి స్థాయి మోడల్ అవ్వాలంటే ఏం చేయాలో కూడా తెలీదు. తనకు ఈ రంగంలో ఎవరూ తెలియదు కాబట్టి.. దీని కోసం అతడు గూగుల్, సోషల్ మీడియాను నమ్ముకున్నాడు. మోడలింగ్ శిక్షణ ఇచ్చి, అవకాశాలు ఇచ్చే ఏజెన్సీలు మాత్రమే మోడల్స్ కెరీర్‌కు ఉపయోగపడతాయని తెలుసుకున్నాడు. అలా పలు సంస్థల్ని సంప్రదించాడు. ఈ సమయంలో అతడు 84 కేజీల వరకు బరువు ఉండేవాడు. కానీ, మోడలింగ్ కోసం అనోన్ మోడల్స్ ఏజెన్సీ నిర్వాహకులు చెప్పారని నెల రోజుల్లో బరువు తగ్గాడు.
ఆయిల్ ఫుడ్, షుగర్, జంక్ ఫుడ్ తగ్గించి, డైట్, వర్కవుట్స్ ద్వారా బరువు తగ్గాడు. అలా నెమ్మదిగా ఇండియాలో మోడల్‌గా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. 2024 జనవరిలో తొలిసారి ఒక సంస్థ ద్వారా ఇటలీ రాజధాని మిలాన్‌లో ఫ్యాషన్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. అలా తొలిసారి తను విదేశాలకు వెళ్లి మోడలింగ్ చేశాడు. తర్వాత ఇండియా వచ్చి మోడలింగ్ చేస్తూనే 2024లో చదువుమీద దృష్టి పెట్టి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత జూన్‌లో మరోసారి మిలాన్ వెళ్లాడు. అక్కడ రెండు నెలలు మోడలింగ్‌లో శిక్షణ తీసుకుని, కొంతకాలం పని చేసి తిరిగి ఇండియాకు వచ్చాడు. ఇక్కడ సివిల్ ఇంజినీర్‌గా రూ.3.6 లక్షల ప్యాకేజీకి ఉద్యోగంలో చేరాడు. అంటే నెలకు రూ.30,000 వేతనం. మోడల్‌గా కెరీర్ ఎలా ఉంటుందో అంచనా వేయలేమని, అందుకే ఉద్యోగంలో చేరానని శుభం చెప్పాడు. నెమ్మదిగా మోడల్‌గా అవకాశాలు పెరుగుతుండటంతో కొంతకాలానికి ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
విదేశాల్లో ఫ్యాషన్ షోలల్లో పాల్గొనడం, జార్జియా అర్మానీ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లకు మోడలింగ్ చేసేవాడు. అలా ఇప్పుడు టాప్ మోడల్స్‌లో ఒకరిగా మారాడు శుభం. ఎంతలా అంటే ఒక రోజు ఫొటో షూట్‌కు రూ.5,00,000 వరకు తీసుకుంటున్నాడు. సంస్థను బట్టి తనకు రోజువారి పారితోషికం ఉంటుందని అంటున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే పని ఉంటుందని, ఒక్కో రోజు.. ఒక్కో బ్రాండుని బట్టి వేతనం అందుతుందని తెలిపాడు. ఇక ఇందులో 30 శాతం ఏజెన్సీ తీసుకుంటే.. మిగతా 70 శాతం అతడికి అందుతుంది. అందులోనూ ఇతర ఖర్చుల కోసం అతడు ఎక్కువగానే వెచ్చించాల్సి ఉంటుందని తెలిపాడు. అయితే, ఏడాదికి రూ.3.6 లక్షల వేతనం అందుకునే స్థాయి నుంచి ఒక రోజుకు రూ.5 లక్షల వరకు ఛార్జ్ చేసే స్థాయికి ఎదిగిన అతడి ప్రయాణం స్ఫూర్తిదాయకం.