హైదరాబాద్ : అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత్‌కు ఎన్నో విధాలా ప్రయోజనకరమని చెబుతున్న మోడీ ప్రభుత్వం దేశ రైతులపై ఆర్థిక బాంబు వేసిందని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Boyalapally Rekha) తీవ్రంగా మండిపడ్డారు. “ఇది ఒప్పందం కాదు – భారత రైతాంగం మెడపై కత్తి. రైతుల భవిష్యత్తును తాకట్టు పెట్టిన లొంగుబాటు పత్రం!” అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ.. రైతు సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపును మోడీ ప్రభుత్వానికి చరిత్రాత్మక చెంపపెట్టు అని ఆమె అభివర్ణించారు.
వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులైన సోయాబీన్ ఆయిల్, డిస్టిలర్స్ గ్రెయిన్స్కు భారత మార్కెట్ తలుపులు తెరవనుంది. ఇది ఒకరకంగా దేశంలోని రైతులను తమ పొలంలోనే పరాయివాడిని చేయడం, పాడి–పశుసంవర్థకం రంగాల నడ్డి విరగొట్టడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉరి వేయడం అని రేఖ ధ్వజమెత్తారు. తాజా ఒప్పందం ద్వారా “పంట మనది – లాభం అమెరికాది! రైతు చెమట – కార్పొరేట్ల ఖాతా!” అనే దోపిడీ నమూనాను దేశంపై మోడీ రుద్దుతున్నారని ఆమె మండిపడ్డారు.
ఎంఎస్పీ(కనీస మద్దతు ధర) గ్యారంటీ ఇస్తామని అని ఓట్లు దండుకున్న మోదీ ప్రభుత్వం ఇప్పుడు అంతర్జాతీయ డంపింగ్‌కు ఎర్రతివాచీ పరోస్తోందని రేఖ ఆరోపించారు. రైతు రక్షణ ముసుగు మాటున అమెరికా బహుళజాతి సంస్థల దోపిడీకి అధికారిక అనుమతి ఇచ్చారని ఆమె స్పష్టం చేశారు. ఈ ఒప్పందం భారత ఆహార భద్రతపై జరిగిన మౌన దాడి అని రేఖ పేర్కొన్నారు. రాష్ట్రాలను అడగలేదు, పార్లమెంటులో చర్చ లేదు – రైతు సంఘాలతో మాటే లేదు! “ఇదేనా మోదీ ప్రజాస్వామ్యం? ఇది
దేశాన్ని కార్పొరేట్లకు రాసిచ్చే చీకటి పాలన!” అని మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ధ్వజమెత్తారు.
ఫిబ్రవరి 12న రైతులు చేపట్టనున్న మహా సమ్మెకు రైతు బిడ్డగా తాను సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నానని ఆమె తెలిపారు. “రైతుల పాలిట శాపంలా మారనున్న అమెరికాతో వాణిజ్యఈ ఒప్పందం రద్దు చేయకపోతే ప్రజాగ్రహం సునామీలా పెల్లుబికుతుంది. దేశాన్ని పోషించే రైతును బలి చేసిన ఏ ప్రభుత్వం చరిత్రలో నిలబడలేదు!” అని రేఖ మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.