– వామపక్ష ప్రజా సంఘాలు
కారేపల్లి, ఫిబ్రవరి 10 : దేశంలోని సమస్త ప్రజల హక్కులపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాడి చేస్తుందని సింగరేణి మండల సీఐటీయూ కార్యదర్శి కె.నరేంద్ర, ఖమ్మం జిల్లా ఏఐకేఎంఎస్ కార్యదర్శి వై.ప్రకాశ్, పీవైఎల్ రాష్ట్ర నాయకుడు భూక్యా శివనాయక్ అన్నారు. ఈ నెల 12న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయటానికి కార్యచరణపై వామపక్షాల ప్రజా సంఘాల నాయకులు సోమవారం కారేపల్లిలోని భాగం రామనర్సయ్య భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్ బిల్లులుగా తీసుకువచ్చి కార్మికులను వెట్టిలోకి నెట్టివేసిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో పేదలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వీబీజి రామ్ జీ బిల్లుగా మార్చి ఉపాధిని దూరం చేస్తుందన్నారు.
రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాది పాటు పోరాట ఫలితంగా క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ రైతుకు కనీసం మద్దతు ధర చట్టం తీసుకొస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. కార్మిక, కర్షక రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశ వ్యాప్తంగా ఈ నెల 12వ తేదిన జరగనున్న సార్వత్రిక సమ్మెను సింగరేణి మండలంలో ఉన్న అన్ని రంగాల కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఐక్యంగా జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎం జిల్లా నాయకులు గుగులోత్ తేజా, ఏఐకేఎంఎస్ ఖమ్మం డివిజన్ నాయకులు దారావత్ సక్రునాయక్ పాల్గొన్నారు.