ఝరాసంగం, జనవరి 27: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మేదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ కేతకీ సంగమేశ్వ స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే, చైర్మన్లకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలోని అమృతగుండంలో జలలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ పేరు మీద గర్భగుడిలోని పార్వతీసమేత సంగమేశ్వర స్వామికి అభిషేకం, మహా మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామి వారి ఆశీస్సులతో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలని స్వామి వారిని కోరుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వారికి పూలమాల శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పాదయాత్రగా బయలుదేరుతున్న వారందరిని గులాబీ కండువా కప్పి పూలమాలతో సన్మానించారు. స్వామి వారి ప్రసాదాన్ని కేసీఆర్కు అందజేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశం, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్, ఝరాసంగం పట్టణ అధ్యక్షుడు ఎజాజ్ బాబా, ఎస్కె సోహెల్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.