Papannapet | పాపన్నపేట, మే 3 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పచ్చదనానికి ఇచ్చిన ప్రాధాన్యత మరి ఏదానికి ఇవ్వలేదు అన్న విషయం నగ్న సత్యం… ఎవరైనా చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకునేది. కానీ ఇటీవల కాలంలో కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థం కోసం నడిరోడ్డుపై పట్టపగలు చెట్లు నరికినా కనీసం పట్టించుకోకపోవడం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ బొడ్మెట్పల్లి ప్రధాన రహదారికి ఇరువైపులా దశాబ్దాల క్రితం నుండి పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి. వీటిని గత కొంతకాలంగా కొంతమంది స్వార్థపరులు నరికి వేస్తున్నారు. ఇదే రహదారిపై లక్ష్మీ నగర్ గ్రామ సమీపాన ఒక రైస్ మిల్ తోపాటు అదే రైస్ మిల్ కు చెందిన ధర్మకాంట ఉంది. దీనికి ఎదురుగా రహదారి పక్కనే ఆర్ అండ్ బి పరిధిలో మామిడి చెట్లు ఉన్నాయి. ఇది అడ్డం రావడం మూలంగా రైస్ మిల్ తో పాటు ధర్మ కంట రోడ్డుపై వెళ్లే వారికి సరిగా కనిపించడం లేదు. దీంతో శుక్రవారం పట్టపగలు దశాబ్దాల క్రితం నాటిన రెండు మామిడి చెట్లను నిర్ధాక్షణంగా నరికి వేశారు. వెంటనే వాటి రెమ్మలను చెరిపి కనిపించకుండా తీసివేశారు.
నిత్యం వేలాదివాహనాలు తిరిగే ఈ రహదారిపై దర్జాగా రైస్ మిల్ యాజమాన్యం పెద్ద పెద్ద చెట్లను నరికివేసిన ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదు. బీదవాడు కనీసం మామిడి కొమ్మలు తెంపుకెళ్ళినా కేసులు నమోదు చేసే ఆర్ అండ్ బి అధికారులు రైస్ మిల్ యజమాని ధన బలం ముందు నిశ్ఛేష్టులు అయ్యారే తప్ప కనీసం ఎలాంటి చర్య తీసుకోలేదు. ఆర్ అండ్ బి అధికారులు వారి పరిధిలో మొక్కలు నాటకున్న పర్వాలేదు కానీ దశాబ్దాల క్రితం నుండి ఉన్న మామిడి చెట్లను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు. చెట్లను నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు సంబంధించిన అధికారులకు విజ్ఞప్తి చేశారు.