తలాపున మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా సాగునీళ్ల కోసం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కక్షతో కర్షకులు అరిగోస పడుతున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాల్వల కోసం రైతులు తమ విలువైన భూములు వదులుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగా దుబ్బాకలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీటి కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
దుబ్బాక, మార్చి 29: రైతుల సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. దుబ్బాక నియోజకవర్గంలో కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు నిర్మించి 10, 11, 12, 14 ప్యాకేజీల ద్వారా సాగునీరందించేందుకు ప్రధాన కాల్వల నిర్మాణం చేపట్టారు. ఇందులో 12వ ప్యాకేజీ ద్వారా 1.25 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది.
ఈ ప్యాకేజీలో అంతర్భాగమైన ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్ (ఎత్తిపోతల పథకం) ఉంది. ఎత్తైన ప్రాంతాలకు కాల్వల ద్వారా నీరు సరఫరా సాధ్యం కాదు. కాల్వలతో కాకుండా పైపులైన్ ద్వారా సాగునీరు అందించేందుకు ఎత్తపోతల పథకం ప్రారంభించారు. ఈ పనులు పూర్తిచేయక పోవడంతో 24 గ్రామాల్లో సుమారు 25 వేల ఎకరాలకుపైగా సాగునీరు సరఫరా కాక ఎడారిగా మారింది.
సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న 24 గ్రామాలకు పైపులైన్ ద్వారా సాగునీరు అందించేందుకు ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని నిర్మించతలపెట్టారు. ఈఎత్తిపోతల పథకం కోసం 2021లో బీఆర్ఎస్ సర్కార్ రూ.111 కోట్లు విడుదల చేయగా 2022లో మెగా కంపెనీ ఆధ్వర్యంలో పను లు ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట వద్ద పంప్‌హౌస్ ఏర్పా టు చేశారు. అక్కడి నుంచి 24 గ్రామాలకు పైపులైన్ నిర్మాణ పనులు చేపట్ట్టారు. రూ.92 కోట్లతో 85శాతం పనులు పూర్తి చేశారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇరుకోడు ఎత్తిపోతల పథకం పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు. మిగిలిన 15శాతం పనులు ఆగిపోయాయి.
ఇరుకోడు ఎత్తిపోతల పథకం ద్వారా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంతో పాటు సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు సాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. దుబ్బాక నియోజకవర్గంలో దుంపలపల్లి, పెద్దగుండవెల్లి, అప్పనపల్లి, హసన్‌మీరాపూర్, తిమ్మాపూర్, పద్మనాభునిపల్లి, మర్రికుంట, గుడికందుల , వరదరాజ్‌పల్లి,గోవర్థన్గిరి, అందె, ధర్మారం,కొండాపూర్, ఎల్లారెడ్డిపేట , పెద్దమసాన్పల్లి,బండారుపల్లి, ఘణపూర్ గ్రామాలు, గజ్వేల్ నియోజకవర్గంలో మర్పడగ, సిరిసినగండ్ల, సిద్దిపేట నియోజకవర్గంలో బుస్సాపూర్, వెంకటాపూర్, తడకపల్లి, ఇరుకోడు, చింతమడక గ్రామాల్లో సాగునీరు సరఫరా చేయాల్సి ఉంది.
ఇందులో పెద్దగుండవెల్లి, తిమ్మాపూర్ గ్రామాల రైతులు ఎత్తిపోతల పథకంపైనే ఆధారపడి ఉన్నారు. రెండు గ్రామాల్లో సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. ఎల్లారెడ్డిపేట పంప్‌హౌస్ నుంచి 18 కిలోమీటర్ల వరకు మెయిన్ పైపులైన్ ఏర్పాటు చేసి, దాని నుంచి ఏడువందల కిలోమీటర్ల వరకు సబ్ పైపులైన్లు ఏర్పాటు చేశారు. సబ్ పైపులైన్లతో రైతులకు సాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. ఎల్లారెడ్డిపేట పంపుహౌస్ వద్ద నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం, సబ్పైపు లైన్లు బిగించకపోవడంతో ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు సరఫరా కావడం లేదు.
దుబ్బాక నియోజకవర్గంలో నిర్మించుకున్న మల్లన్నసాగర్ జలాలు రైతులకు దక్కకపోవడం బాధాకరం. నియోజకవర్గ రైతుల త్యాగాలతో నిర్మించుకున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు. కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రతి ఎకరానికి సాగునీరందించేందుకు ప్రాజెక్టు ద్వారా ప్రధాన కాల్వలు నిర్మించాం. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఉపకాల్వల నిర్మాణ పనులు చేపట్టడం లేదు. ఇరుకోడు ఎత్తిపోతల పథకం పనులు బీఆర్ఎస్ సర్కార్‌లో (రెండేండ్ల కాలంలో) 85 శాతం పూర్తి చేస్తే మిగిలిన 15శాతం పనులు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదు. ఈ విషయంపై పలుమార్లు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదు. శాసనసభలో సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లా. ప్రభుత్వం రైతులపై రాజకీయ కక్ష సరికాదు.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల రాజకీయం చేయడం సరికాదు. మా గ్రామం ఎత్తుప్రాంతంలో ఉంది. ఇక్కడ కాల్వల ద్వారా నీరు రాదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎత్తిపోతల పథకంలో భాగంగా పైపులైన్ వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 27 నెలలు గడుస్తున్నా చిన్నపాటి పని చేయలేదు. సాగునీటి కోసం అరిగోస పడుతున్నాం. నాకు ఆరు ఎకరాల భూమి ఉంది. యాసంగి రెండు ఎకరాల్లో వరి సాగుచేస్తే పారక పంట ఎండిపోతున్నది. ఎత్తిపోతల పథకం ద్వారా నీరు సరఫరా చేస్తే ఆరు ఎకరాల్లో పంట సాగయ్యేది. ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు.
– మన్నే సాయిలు, రైతు, పెద్దగుండవెల్లి, (సిద్దిపేట జిల్లా)
కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి మూడు పంటలు క్రాప్‌హాలిడే ప్రకటించింది. మాకున్న ఏడు ఎకరాల భూమి వర్షాకాలంలోనే పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మా గ్రామానికి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు సరఫరా చేస్తారని ఎంతో ఆశపడ్డాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఆశలపై నీళ్లు చల్లింది. నెలరోజుల్లో పూర్తయ్యే పనులను 27 నెలలు దాటినా కాంగ్రెస్ సర్కార్ పూర్తిచేయడం లేదు. – బీర్ల స్వామి, యువరైతు,
-పెద్దగుండవెల్లి, సిద్దిపేట జిల్లా