రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు ఎంతగానో కృషిచేసి మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మల్లన్న సాగర్ కాల్వల నిర్మాణంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. దుబ్బాక మండలం పోతారం, గంభీర్పూర్, అచ్చుమాయిపల్లి గ్రామాల మీదుగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ఎల్4 కాల్వల పనులను బుధవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మల్లన్నసాగర్ కాల్వల నిర్మాణంలో జాప్యంపై ఎమ్మెల్యే స్పందించారు. మల్లన్నసాగర్ కాల్వల పనులు పూర్తిచేసి ఆకుపచ్చ దుబ్బాకగా తీర్చిదిద్దుతానని తెలిపారు. కేసీఆర్ బడి భవనంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపడుతామని, ఈ బడిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దుబ్బాక, జనవరి 3: మల్లన్నసాగర్ కాల్వలను పూర్తిచేసి దుబ్బాకను ఆకుపచ్చ తివాచీగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దుబ్బాకలో మల్లన్నసాగర్ కాల్వల నిర్మాణంలో పలుచోట్ల జాప్యం జరుగుతుం డటంపై అసహనం వ్యక్తం చేశారు. బుధవారం దుబ్బాక మండలం పోతారం, గంభీర్పూర్, అచ్చుమాయిపల్లి గ్రామాల మీదుగా నిర్మిస్తున్న కాల్వల పనులను మల్లన్నసాగర్(ఇరిగేషన్) అధికారులతో కలిసి వాహనాన్ని స్వయంగా నడిపిస్తూ పరిశీలించారు. మల్లన్నసాగర్ నుంచి 4ఎల్ ప్రధాన కాల్వకు అనుసంధానంగా సుమారు 15 కి.మీ పొడవుతో నిర్మిస్తున్న చిన్న కాల్వల పనులు, మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు ఎంతగానో కృషి చేసిందన్నారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. సాగునీటి కష్టాలను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మల్లన్నసాగర్‌తో దుబ్బాక నియోజవర్గంలో బీడు భూములు సస్యశ్యామలమయ్యాయన్నారు. ప్రాజెక్టు ప్రధాన కాల్వల నుంచి పొలాలకు సాగునీరందించేందుకు చిన్న కాల్వలను నిర్మించినట్లు తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న కాల్వల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. 6న కలెక్టరెట్లో నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాల్వల నిర్మాణ పనులపై వారానికోసారి రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కాల్వల నిర్మాణంలో భూములు కోల్పోతున్న పలువురు రైతులకు నష్ట పరిహారం అందలేదని తమ దృష్టికి వచ్చిందని, వారికి ప్రభుత్వపరంగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. 6 నెల ల్లో కాల్వల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. యాసంగికి నీరందించేందుకు చర్య లు చేపడుతున్నామన్నారు. 4ఎల్ ప్రధాన కాల్వ నుంచి నిర్మిస్తున్న చిన్న కాల్వల ద్వారా దుబ్బాక మండలంలో సుమారు 30 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. మల్లన్నసాగర్ దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల రైతులకు వరప్రదాయినిగా మారిందని ఎమ్మెల్యే అభివర్ణించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ వేణుబాబు, ఏడబ్ల్యూఈ తిరుపతి, డీఈఈ శ్రీకాంత్, సర్పంచ్‌లు జనార్ధన్‌రెడ్డి, భాస్కర్, నాయకులు కిషన్‌రెడ్డి, శ్రీనివాస్, స్వామి, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.