చేర్యాల, సెప్టెంబర్ 7 : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన కొమురవెల్లి మల్లన్నక్షేత్రంపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది.ఏకంగా ఇద్దరు క్యాబినెట్ మంత్రులు (కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌గౌడ్) ఇంటి ఇలవేల్పుగా ఉన్నా మల్లన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలోని ప్రధాన ఆధ్మాత్మిక క్షేత్రాల అభివృద్ధి కోసం ఇటీవల ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించింది. ఆయా క్షేత్రాల్లో ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సర్కారు మాస్టర్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలోని తొమ్మిది ప్రముఖ ఆలయాల కోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేసి సీజీఎఫ్తో పాటు ఇతర శాఖల నిధులు మొత్తం రూ.779.74కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు సర్వం సిద్ధం చేశారు.వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం, బాసర జ్ఞానసరస్వతీ ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, కొడంగల్ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం, ఆలంపూర్లోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, చెర్వుగట్టు పార్వతిజడల రామలింగేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి సర్కారు మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్లు ఇటీవల దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు.
కానీ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లన్న ఆలయానికి దేవాలయ అభివృద్ధి, మాస్టర్‌ప్లాన్‌లో చోటు దక్కకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొమురవెల్లి మల్లన్న ఖజా నా నుంచి ప్రతి ఏటా రూ.6కోట్లు సీజీఎం రూపంలో సర్కారు పన్ను వసూలు చేస్తున్నది. మాస్టర్‌ప్లాన్ వల్ల క్షేత్రంలో రోడ్ల విస్తరణ, మొక్కల పెంపకం, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక విభాగం, అన్నదాన కేంద్రం, అగ్నిమాపక సేవలు, క్యూలైన్ కాంప్లెక్స్‌లు, బ్ర హ్మోత్సవాల్లో సాంస్కృతిక,ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు వసతులు కల్పిస్తారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు 2011లో మల్లన్న ఆలయవర్గాలు మాస్టర్‌ప్లాన్ తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ కన్సల్టెన్సీతో క్షేత్ర స్థాయిలో సర్వే చేయించి మాస్టర్‌ప్లాన్ బ్లూఫ్రింట్ సిద్ధం చేసి దేవాదాయశాఖ అధికారులకు ఇచ్చారు.కానీ మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు.