హుస్నాబాద్, మే 4: సకాలంలో మక్కల కొనుగోళ్లు జరగక మక్క రైతులు కష్టాలతో విలవిలలాడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఒకవైపు వడ్లతో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు మక్కలు కొనడంలేదని మొక్కజొన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గన్నీ బ్యాగుల కొరతతో మార్కెట్ యార్డులో మక్కల కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో యార్డులో పోసిన మక్కల రాసులు ఎక్కడికక్కడే పేరుకుపోయాయి. చాలామంది రైతుల మక్కలకు తేమశాతం వచ్చినప్పటికీ గన్నీ సంచులు లేక కాంటాలు పెట్టడంలేదు. పది రోజుల క్రితం వచ్చిన రైతులు కూడా కాంటాలు సకాలంలో పెట్టకపోవడంతో యార్డులోనే నిరీక్షించాల్సి వస్తోంది. మక్కల కొనుగోళ్లలో అధికారులు చేస్తున్న జాప్యం రైతులకు శాపంగా మారింది. ఒకవైపు తీవ్ర ఎండ, మరో వైపు భారీగా వర్షాలు.. వెరసి రైతులు తమ పంటను కాపాడుకునేందుకు సతమతమవుతున్నారు.
పేరుకుపోయిన మక్కల రాసులు
అధికారులు సకాలంలో మక్కలు కొనకపోవడంతో హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఎక్కడ చూసినా మక్కల రాసులే కనిపిస్తున్నాయి. నాలుగైదు రోజులుగా మక్కలకు మాయిశ్చర్ సైతం వచ్చినా కొనలేదు. ఆదివారం కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. దీంతో సోమవారం ఉదయం నుంచి మక్కలను మళ్లీ ఎండబెట్టుకోవాల్సి వస్తోంది. అధికారులు సకాలంలో మక్కలు కొంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు నెల రోజులుగా కేవలం 747 మంది రైతుల 29,422 క్వింటాళ్ల మక్కలు మాత్ర మే కొన్నారు. కొనుగోలు చేసిన మక్కలకు ఇప్పటి వరకు చెల్లింపులు జరగక పోవడం గమనార్హం.
మార్కెట్లో ఆందోళనకు దిగిన రైతులు
ఐదు రోజులుగా మక్కలు కొనుగోలు చేయకపోవడాన్ని తట్టుకోలేని మక్క రైతులు సోమవారం మార్కెట్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే మక్కల కొనాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, సుద్దాల చంద్రయ్య, చిత్తారి శ్రీనివాస్, బోజు రవీందర్, వికాస్, శ్రీనివాస్ తదితరులు రైతులకు మద్దతు తెలిపారు. వెంటనే గన్నీ సంచులు ఇచ్చి మక్కలు కొనుగోలు చేయాలని మార్కెట్ చైర్మన్‌ను రైతులు నిలదీశారు. ఆందోళన వద్దకు చేరుకున్న ఆర్డీవో రామ్మూర్తి రైతులతో మాట్లాడి గన్నీ సంచులు కొనుక్కోవాల్సిన అవసరం లేదని, వెంటనే తెప్పించి కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ప్యాక్స్ అధికారులను వివరణ కోరగా సాయంత్రం వరకు గన్నీ బ్యాగులు వస్తాయని, మంగళవారం నుంచి కొనుగోళ్లు చేస్తామని చెప్పారు.
రైతులే గన్నీ సంచులు కొనుక్కోవాలి
మక్కల కొనుగోలుకు గన్నీ సంచులు రావని, రైతులే కొనుక్కోవాలని మార్కెట్ యార్డు అధికారులు చెప్పడంతో రైతులు అయోమయానికి గురయ్యారు. సోమవారం ఉదయం రైతులనే గన్నీ సంచులు తెచ్చుకోవాలని చెప్పడంతో కొందరు ఏంచేయాలో తెలియక ఇబ్బందిపడ్డారు. ఒక్కో గన్నీ సంచికి రూ.15 చొప్పున రైతుల ఖాతాల్లో వేస్తామని అధికారులు చెప్పారు. మధ్యాహ్నం వరకు మళ్లీ మాటమార్చిన అధికారులు గన్నీ సంచులు వస్తున్నాయని చెప్పడం విశేషం.