నారాయణఖేడ్, మార్చి 13: ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించవద్దని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా అనుమతులు ఇస్తామని అప్పట్లో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇచ్చిన హామీని విస్మరించి ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి ముక్కు పిండి వసూళ్లకు పాల్పడడమేంటని, చిత్తశుద్ధి ఉంటే ఉచితంగా అనుమతులిచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన చేసిన లేఔట్లను సవరించే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ద్వారా తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటును కల్పించిందన్నారు. ప్రజల సౌలభ్యం కోసం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు వినియోగించుకుంటుందని విమర్శించారు.
ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై కఠినంగా వ్యవహరిస్తుండడంతో ప్లాట్ల యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారని, తమ అవసరాల నిమిత్తం ప్లాట్లను విక్రయించుకునే వీలు లేకుండా ఎల్ఆర్ఎస్ నిబంధనలు ఆటంకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల తరఫున పోరాడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, ప్రజలెవరూ ఎల్ఆర్ఎస్ చెల్లించవద్దని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ జాబితాలో ఎల్ఆర్ఎస్ ఒకటని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆహీర్ పరశురామ్, నాయకులు వెంకటేశం, సిద్దు, సురేశ్ తదితరులు ఉన్నారు.