చేగుంట, అక్టోబర్ 4 : మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో బైక్ ఎత్తుకెళ్తున్న దొంగలకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా ఓ దొంగ జేబులో ఉన్న పెట్రోల్తీసుకుని, వారిపై జల్లి నిప్పంటించారు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
శనివారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు గ్రామంలోని ఓ బైక్‌ను దొంగతనం చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. మా ఊళ్లోనే దొంగతనం చేస్తారా అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి దేహశుద్ధి చేస్తున్న క్రమంలోనే ఓ దొంగ జేబులో పెట్రోల్ బాటిల్‌ను పలువురు గుర్తించారు. అదే పెట్రోల్‌ను అతనిపై చల్లి నిప్పుపెట్టారు. అయితే మరికొందరు అప్రమత్తమై, దొంగకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన దొంగను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. దొంగలను జంగరాయి గ్రామానికి చెందిన యేవాన్, మహిపాల్‌గా పోలీసులు గుర్తించారు. గ్రామస్తుల దాడిలో గాయపడిన యేవాన్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇక మహిపాల్‌పై ఇప్పటికే పోక్సో కేసు నమోదైందని పేర్కొన్నారు.
కాగా, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్, చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డిలు వడియారం గ్రామానికి వెళ్లి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నట్లు డీఎస్పీ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.