అందోల్, జూన్ 26 : సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని 1141 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా మొరం తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ సర్వేనంబర్‌లో కొన్ని రోజులుగా ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతూ మట్టి, మొరం తరలిస్తున్నారు. శుక్రవారం స్థానిక కౌన్సిలర్ నాగరత్నంగౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, స్థానికులు అక్కడికి వెళ్లి మొరం తవ్వుతున్న వ్యక్తులను ప్రశ్నించారు. అన్ని అనుమతులతో తవ్వుతున్నట్లు సమాదానం చెప్పారు. కానీ, అనుమతి పత్రాలు చూపమనడంతో నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో వారు వెంటనే రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో అధికారులు అక్కడికి చేరుకుని అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న రెండు టిప్పర్లు, జేసీబీని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగరత్నంగౌడ్ మాట్లాడుతూ.. 1141 సర్వేనంబర్‌లో పగలు,రాత్రి తేడాలేకుండా మట్టి, మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా తవ్వకాలు మాత్రం ఆగడంలేదని అన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతో పాటు పర్యావరణం దెబ్బతింటున్నదని తెలిపారు. జిల్లా అధికారులు ఈవిషయంపై ప్రత్యేక దృష్టి సారించి అక్రమ మట్టి తరలిపుకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ విషయంపై తహసీల్దార్ సాగర్మధుకర్రెడ్డిని వివరణ కోరగా, సర్వేనంబర్ 1141లో శుక్రవారం అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లు, జేసీబీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆర్అండ్బీ అధికారులు రోడ్డు నిర్మాణానికి మొరం అవసరం ఉన్నదని తమతో పాటు మైనింగ్‌శాఖకు అనుమతికోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అనుమతి వచ్చిన తర్వాతనే మొరం తరలించాలని చెప్పినప్పట్టికీ, వారు పనులు ప్రారంభించారని, దీంతో వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎవరైనా సరే సంబంధిత శాఖల అనుమతి లేకుండా మైనింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం పనులకు సైతం తప్పనిసరిగా అన్ని అనుమతులు తీసుకుని పనులు చేపట్టాలన్నారు.
అందోల్-జోగిపేట మున్సిపల్‌తో పాటు మండల వ్యాప్తంగా అధికారుల అండతో జోరుగా అక్రమ మైనింగ్ కొనసాగుతున్నదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు నిలువునా పాతరేస్తూ ప్రకృతి సంపదను కొందరు కొల్లగొడుతుంటే, అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
మైనింగ్, రెవెన్యూ నిబంధనలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా గుట్టలను పిండిచేస్తు సొమ్ముచేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడని పేర్కొన్నారు. విలువైన సహజ సంపద దోపిడీకి గురవుతుంటే అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. పగలు,రాత్రి తేడాలేకుండా జేసీబీలతో తవ్వకాలు జరుగుతున్నా.. పదుల సంఖ్యలో టిప్పర్లు తిరుగుతున్న అధికారులు నిద్రపోతున్నారా..? ఇంటి నిర్మాణం కోసం ఒక ట్రాక్టర్ మట్టి తీసుకు వెళ్లేందుకు ఆంక్షలు పెట్టే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని చంటి క్రాంతికిరణ్ ప్రకటనలో దుయ్యబట్టారు.