నారాయణఖేడ్, మార్చి 7: నారాయణఖేడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను బంద్ పెట్టినందుకు వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీని బొంద పెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గురువారం నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జుజాల్పూర్ శివారులోని హెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో స్థానిక మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీకి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.40 కోట్ల ఎస్డీఎఫ్, టీయూఐడీసీ నిధులు మంజూరు చేసిందన్నారు. ఆ నిధులను రద్దు చేసి కేవలం రూ.10 కోట్లు మంజూరు చేశారన్నారు. తడ్కల్ మండలం ఏర్పాటు కాకుండా అడ్డుకుంటున్నారని, కొత్తగా అధికారం చేపట్టిన వారు గత ప్రభుత్వం కంటే మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. కానీ, మంజూరైన పనులు నిలిపివేయడం మంచిది కాదని హరీశ్‌రావు హితవు పలికారు.
నారాయణఖేడ్ నియోజకవర్గానికి అభివృద్ధి రుచి చూపించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది అన్నారు. ఇక్కడి ప్రజలు పదిసార్లు కాంగ్రెస్‌ను గెలిపిస్తే చేయలేని పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం పదేండ్లలో చేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సబ్స్టేషన్లు, మార్కెట్‌యార్డులు, కొత్త చెరువులు, రోడ్లు, డీఎస్పీ, ఆర్డీవో కార్యాలయాలు, కొత్త మున్సిపాలిటీ, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు ఐదు కొత్త మండలాలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. ప్రజలకు మంచినీరు దొరకని పరిస్థితి ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేసి ప్రతి తండాకు, ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేశామన్నారు. ఎనిమిది గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టి ఇంగ్ల్లిష్ మీడియం విద్యనందించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం చేసిన పనుల్లో గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటైనా చేసిందా అని ప్రశ్నించారు.
ఆరు గ్యారంటీలు, 13 హామీలతో అధికారం చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డి హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. రెండు నెలల్లోనే కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు అర్థమైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా సమయంలోనూ రైతుబంధును నిరంతరాయంగా అందించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుబంధును నిలిపివేసి రైతులను ఇబ్బంది పెడుతున్నదన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ తీరుపై గ్రామాల్లో చర్చపెట్టి వచ్చే ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు హామీలివ్వడమే కాదు ప్రజలను నమ్మబలికేందుకు వంద రోజుల్లో అమలు చేస్తామని రాసిన బాండ్పేపర్లను గ్రామాల్లో పంపిణీ చేశారన్నారు. ఈనెల 15వ తేదీతో వంద రోజులు పూర్తవుతుందని, బాండ్‌పేపర్ రాసిచ్చిన కాంగ్రెస్ నాయకులపై చీటింగ్ కేసులు పెట్టాలన్నారు. బీబీ పాటిల్‌ను బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు ఎంపీగా అవకాశం కల్పిస్తే, తల్లిలాంటి పార్టీని మోసం చేసి బీజేపీలో చేరారని, బీబీ పాటిల్‌కు ఎంపీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకుల చేష్టలు చూస్తుంటే ప్రతి కార్యకర్తకూ రక్తం మరిగిపోతున్నదని, బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. చిటికేస్తే తనతో పాటు బీఆర్ఎస్ నేతలంతా కార్యకర్తలకు వెన్నంటి ఉంటామని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కార్యకర్తలు కసితో పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యకర్తలకు సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంతో పాటు జిల్లా అభివృద్ధి కోసం మాజీ మంత్రి హరీశ్‌రావు అహర్నిశలు కృషి చేశారన్నారు. హరీశ్‌రావు సారథ్యంలో ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందే దిశగా కార్యకర్తలు కార్యోన్ముఖులై పనిచేయాలన్నారు.
మార్పు రావాలని కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చారని, తీరా కాంగ్రెస్ తెచ్చిన మార్పుతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. తాము చేసిందే చెప్పడంతో పాటు సాధ్యమయ్యే హామీలిచ్చి ప్రజల ముందుకు వెళ్లినా.. ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి మోసపోయారన్నారు. బీఆర్ఎస్దే నైతిక విజయమని, వచ్చే ఎంపీ ఎన్నికల్లో కార్యకర్తలందరూ సోదరాభావంతో కలిసి పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, బీఆర్ఎస్ నేతలు గాలి అనిల్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, భిక్షపతి, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.