సిద్దిపేట, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి టికెట్లు అమ్ముకున్నావని ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 స్థానాలకు గాను నారాయణ్‌ఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాలు మినహా అన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ ప్రకటించిన జాబితాలపై కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలు భగ్గుమన్నారు. డబ్బులు ఉన్న వారికే పార్టీ టికెట్లు ఇచ్చిందని నాయకులు బహిరంగంగా ఆరోపించారు. కష్టపడి పనిచేస్తే పార్టీలో సరైన గుర్తింపు లేదని, నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ తమ అనుచరులతో అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసిసుకొని తమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ అభ్యర్థులకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. మరికొన్ని చోట్ల రెబల్‌గా లేదా స్వతంత్రంగా బరిలో నిలిచేందుకు ఆలోచన చేస్తున్నారు.మరికొంత మంది నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామాలు చేశారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఉమ్మడి జిల్లాలో ఆపార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఆపార్టీ అధినాయకత్వంపై నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారని మండిపడుతున్నారు. పార్టీ కోసం అన్ని అమ్ముకొని, కష్టపడి పనిచేస్తే పార్టీలో సరైన గుర్తింపు లేదని వాపోతున్నారు. నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తున్నారు. తడి గుడ్డతో గొంతు కోస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే తొలి విడత జాబితాను ప్రకటించగా శుక్రవారం రెండో విడత జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది స్థానాలతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కలుపుకుంటే మొత్తం 11 స్థానాలు ఉన్నాయి. వీటిలో నారాయణఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాలు మినహా అన్ని చొట్ల కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, నర్సాపూర్, నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించగా తొలి జాబితాలో సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, మెదక్, గజ్వేల్ నియోజకవర్గాల అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈజాబితాలపై కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలతో అట్టుడుగుతున్నది. డబ్బులున్న వారికే ఆ పార్టీ టికెట్లు ఇచ్చిందని పార్టీ నాయకులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనతో అన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి రాగాలు.. మిన్నంటుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు కాకుండా డబ్బు సంచులున్న నాయకులకే టికెట్లు కేటాయించారని తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ ఆపార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ తమ అనుచరులతో అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకొని తమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ అభ్యర్థులకు సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. మరికొన్ని చోట్ల స్వతంత్రంగా పోటీ చేసే అలోచన సైతం చేస్తున్నారు. మరికొంత మంది నేతలు కార్యకర్తలు ఆపార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పటికే మెజార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్‌లో టికెట్లలొల్లి
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పార్టీ కోసం పనిచేసిన తమకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ వస్తుందని ఆశించిన అభ్యర్థులకు పార్టీ అధిష్టానం టికెట్ కెటాయించకపోవడంతో తీవ్ర అసంస్తృప్తికి లోనయ్యారు. ఎన్నోఏండ్లుగా పార్టీ కోసం పనిచేసిన తమను పక్కనపెట్టి ఇతర పార్టీలకు కోవర్టుగా పనిచేసే వ్యక్తికి టికెట్ కెటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం పారీ ్టకోసం పనిచేసే వారిని గుర్తించి టికెట్ కెటాయించాలని లేనిపక్షంలో రెబల్ అభ్యర్థిగానైనా పోటీలో ఉంటామని హెచ్చరించారు. శనివారం హత్నూర మండలం సాదుల్లానగర్ శివారులోని ఓ ఫాంహౌస్‌లో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి గాలి అనిల్‌కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతో ఎన్నోఏండ్లుగా పార్టీని నియోజవకర్గంలో బలోపేతం చేశామన్నారు.
పార్టీ అధిష్టానం ఎప్పుడు పిలుపునిచ్చినా గ్రామస్థాయిలో కార్యకర్తలను ఏకంచేసి కార్యక్రమాలను విజయవంతం చేసినట్లు తెలిపారు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కెటాయిస్తుందని భావించినప్పటికీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇతర పార్టీలకు కోవర్టుగా పనిచేసే వ్యక్తికి టికెట్ కెటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఏనాడూ పార్టీ కోసం పనిచేయని ఆవుల రాజిరెడ్డికి టికెట్ ఎలా కెటాయిస్తారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కొందరిని ఇతర పార్టీకి మద్దతు ఇప్పించి బ్రోకర్ పనిచేసిన వ్యక్తికి ఏవిధంగా టికెట్ కెటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచన చేసి తమ ముగ్గురిలో ఎవరికైనా టికెట్ కెటాయించాలని, లేనిపక్షంలో రెబల్ అభ్యర్థిగా బరిలో వుంటామని హెచ్చరించారు. త్వరలో ప్రకటించబోయే మూడో లిస్టులో నర్సాపూర్ అభ్యర్థిని మార్చాలని లేనిపక్షంలో గ్రామగ్రామాన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను ఏకం చేసి బరిలో నిలుస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అసంతృప్తితో రగిలిపోతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తీరు అగమ్యగోచరంగా మారింది. పార్టీ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఆ పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి మరోసారి కాంగ్రెస్ అధిష్టానం మొండి చెయ్యి చూపింది. ఆయన 2009 ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీపై పోటీచేసి విజయం సాధించి ఎమ్మెల్యేగా సేవలను అందించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా హుస్నాబాద్ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఆయనకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం అనుహ్యంగా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడంతో ప్రవీణ్‌రెడ్డి మండిపడుతున్నారు. కాంగ్రెస్ టికెట్ ఇస్తామంటూ మోసం చేసిందని ఆయన వర్గీయులు పార్టీపై తీవ్ర ఆగ్రం వ్యక్తం చేస్తునారు. పార్టీ నమ్మక ద్రోహం చేసిందని ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నయవంచన కాంగ్రెస పార్టీఅని తడిగుడ్డతో గొంతు కోసంది అని కార్యకర్తలు మండిపడ్డారు. రెండు మూడు రోజల్లో స్వతంత్రంగా పోటీ చేయడమా.? పార్టీకి రాజీనామా చేయడమా..? అనేది నిర్ణయం తీసుకోనున్నారు. శనివారం ఉదయం ప్రవీణ్‌రెడ్డి ఇంటికి హుస్నాబాద్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ వెళ్లి కలిశాడు. ప్రవీణ్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోయినట్లు సమాచారం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు సహకరించేది లేదని చెప్పినట్లు సమాచారం.
మెదక్ జిల్లాలోనూ..
మెదక్ జిల్లా నర్సాపూర్ టికెట్‌ను డబ్బులకు అమ్ముకుందని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఇక్కడ ఆవుల రాజిరెడ్డిని ప్రకటించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అసంతృప్తి నేతలైన గాలి అనీల్‌కుమార్, ఆంజనేయులు, రవీందర్‌రెడ్డి హత్నూరలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడ్డారు. పార్టీ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. మార్చకపోతే తాము బరిలో ఉంటామని అధిష్టానాన్ని హెచ్చరించారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్‌రావును ప్రకటించడంపై అక్కడి పార్టీ నేతలు ఆపార్టీకి రాజీనామాలు చేసి బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి నేత మ్యాడం బాలకృష్ణ ఉన్నారు. సంగారెడ్డి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డికి టికెట్ కేటాయించారు. ఇక్కడ పొన్న శేఖర్‌గౌడ్, సంగమేశ్వర్‌తో పాటు మరికొంత మంది తీవ్ర అసంతృప్తి నేతలు ఉన్నారు. మరికొంత మంది బీఆర్ఎస్లో చేరిపోయారు. ఆందోల్‌లో కాంగ్రెస్ నుంచి దామోదర రాజనర్సింహకు టికెట్ కేటాయించారు. జహీరాబాద్ నుంచి మాజీ మంత్రి చంద్రశేఖర్‌కు టికెట్ ఇచ్చారు. దీనిని వ్యతిరేకిస్తూ పలువురు ఆ పార్టీకి రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరారు. దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ కేటాయించారు.
ఇక్కడ కత్తి కార్తీకగౌడ్, పన్యాల శ్రవణ్‌కుమార్‌రెడ్డి టికెట్ కోసం ఆశించి భంగపడ్డారు. వీరు తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ మాదాడి రంగారెడ్డి కుమారుడు జశ్వంత్‌రెడ్డి రెండు రోజుల కిందట ఇతర పార్టీలో చేరిపోయారు. యువనేత శ్రీకాంత్‌రావు కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఆపార్టీకి రాజీనామాలు చేసి బీఆర్ఎస్లో చేరిపోయారు. సిద్దిపేట నుంచి పూజల హరికృష్ణకు టికెట్ ఇవ్వడంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు పార్టీ కోసం డబ్బులు ఖర్చు చేసిన తమకు టికెట్ ఇవ్వలేదని వారు వాపోతున్నారు. ప్రధానంగా దరిపల్లి చంద్రం, తాడూరి శ్రీనివాస్‌గౌడ్, గూడూరి శ్రీనివాస్ తదితర నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇంకా రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఖరారు చేయలేదు. పటాన్చెరు నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో కాట శ్రీనివాస్, సపాన్దేవ్తో పాటు నిన్ననే చేరిన నీలం మధు, నారాయణఖేడ్ నుంచి సురేష్ శెట్కార్, సంజీవరెడ్డి, దేవునూరి లక్ష్మణ్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఏదిఏమైనా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తుంది.