సిద్దిపేట అర్బన్, నవంబర్ 11: సుడా వెంచర్ కోసం తమ భూములను బలవంతంగా తీసుకున్నారని, ఆ వెంచర్లో ప్లాట్లు కొంటే భవిష్యత్‌లో తమ నుంచి కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తదని సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి సుడా వెంచర్‌కు సంబంధించిన భూ బాధితులు హెచ్చరించారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని సుడా కార్యాలయం ఎదుట మిట్టపల్లి భూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు.
వేలంపాట నిర్వహించే హాల్లోకి బాధితులు దూసుకువెళ్లగా పోలీసులు అడ్డుకొని బయటకు పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు నష్టపరిహారం చెల్లించకుండానే తమ భూములను సుడా ప్లాట్లుగా వేలం వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో తమ తాతలకు భూములను కేటాయిస్తే తాము వ్యవసాయం చేసుకుంటున్నామని, కానీ ఆ భూముల్లో సుడా వెంచర్ వేశారని బాధితులు తెలిపారు. సుడా వెంచర్లో తాము భూములు కోల్పోతే అసలైన లబ్ధిదారులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఇతర వ్యక్తులకు ఇచ్చారని బాధితులు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు భూమి మ్యుటేషన్ చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. కోర్టులో ఉన్న భూములను వేలం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని భూ బాధితులు తెలిపారు.