జహీరాబాద్/ఝరాసంగం, అక్టోబర్ 23: నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానూఫ్యాక్చర్ జోన్(నిమ్జ్) ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో భూ సేకరణ చేపడుతున్నది. ఈ భూ సేకరణలో రెవె న్యూ అధికారులు, దళారులు కుమ్మక్కై భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో 12,635.14 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీచేశారు. ఇప్పటివరకు 17 గ్రామాల్లో 7,526.03 ఎకరాల భూమిని సేకరించారు.
ఈ భూసేకరణలోనే సంబంధిత నిమ్జ్ ప్రాజెక్టు పనిచేసే అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి పరిహారం చెల్లింపులో అక్రమాలకు పాల్పడినట్లు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. లంచాలు ఇవ్వలేదనే సాకుతో ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన భూ బాధిత రైతులకు సంబంధిత అధికారులు పరిహారం చెల్లించలేదు. దీంతో రెవెన్యూ అధికారులు, దళారులు కుమ్మక్కై రికార్డుల్లో బై నంబర్లతో బినామీ రైతుల పేర్లు సృష్టించి పరిహారం చెల్లించారు. ఈ విషయంలో జిల్లాస్థాయి అధికారులతోపాటు సం బంధిత నిమ్జ్ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని రైతులు వాపోతున్నారు.
నిమ్జ్ ప్రాజెక్టు కోసం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో భూసేకరణకు 2011లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2015-16లో ఝరాసంగం మండలంలో భూ సేకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఎల్గోయి గ్రామంలో 2,383.30 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఇం దులో 1,452 ఎకరాల పట్టాభూమి, 931.26 ఎకరాల ప్రభు త్వ (అసైన్డ్‌ల్యాండ్) భూములు ఉన్నాయి. ఇందులోని అసైన్ భూమి 54 సర్వేనంబర్‌లో 328.10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో 1975 నుంచి పట్టాపాసు పుస్తకాలు కలిగి ఉన్న గ్రామానికి చెందిన 17మంది రైతులు పంటలు సాగుచేస్తున్నారు.
నిమ్జ్ భూ సేకరణలో బాధిత రైతుల పేర్లు ఉండడంతో పరిహారం మంజూరైంది. బాధిత రైతులు పరిహారం చెక్కులను తీసుకునేందుకు సంబంధిత అధికారుల వద్దకు వెళ్లారు. అయి తే పరిహారం చెక్కులు కావాలంటే మామూళ్లు ఇవ్వాల్సిందేనని అధికారులు డిమాండ్ చేశారు. అసలే భూములు కోల్పోతున్నామని, తాము ఎక్కడ నుంచి తెచ్చి మామూళ్లు ఇవ్వాలని అధికారులతో మొరపెట్టుకున్నట్లు బాధిత రైతులు వాపోయారు. దీంతో అప్పట్లో రెవెన్యూ శాఖ కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారులు, దళారులు కలిసి 2016లో 54 సర్వే నంబర్లకు బై నంబర్లు సృష్టించి బినామీ పేర్లను నమోదు చేశారు.
తమకు మాత్రం అధికారులు నష్ట పరిహారం చెల్లించలేదని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. అసైన్డ్ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగా పేర్లు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు, దళారులు కుమ్మక్కై బైనంబర్లతో బినామీ పేర్లు ఎలా నమోదు చేస్తారని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో అసైన్మెంట్ కమిటీ లేకున్నా రికార్డులో బై నంబర్లతో కొంత మందికి పరిహారం చెక్కులు అందించినట్లు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. కానీ, 1975 నుంచి భూ రికార్డులు ఉన్న గ్రామానికి చెందిన అర్హులైన 17 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు.
ఈ విషయమై సంబంధిత కలెక్టర్, జహీరాబాద్ ఆర్డీవో, నిమ్జ్ ఆధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిందని బాధిత రైతులు పాపోతున్నారు. గతంలో ఝరాసంగం తహసీల్ కార్యాలయంతో పాటు నిమ్జ్ ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు కలిసి మా మూళ్లు ఇవ్వకపోవడంతోనే బై నంబర్లతో బినామీ పేర్లు నమో దు చేసి తమకు అన్యాయం చేశారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిమ్జ్ అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటే పరిహారం అందరికీ ఇచ్చేశామని, ఇంకెక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని అంటున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన అధికారులు, దళారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.
1975లో అసైన్‌మెంట్‌లోనే అప్పటి ప్రభుత్వం మాకు సర్వే నంబర్ 54/48లో ఐదు ఎకరాల భూమిని కేటాయించి పట్టాపాస్ పుస్త్తకాలు ఇచ్చింది. అప్పటి నుంచి భూమి సాగు చేసుకుంటున్నాం. 2016లో నిమ్జ్ భూ సేకరణలో నాకున్న ఐదుఎకరాల భూమి పోయింది. నిమ్జ్‌లో భూమిని కోల్పోవడంతో ప్రభుత్వం నుంచి పరిహారం మంజూరైంది. పరిహారం చెక్కు కోసం అధికారుల వద్దకు వెళ్తే మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంచాలు ఇవ్వలేనని చెప్పడంతో సర్వే నంబర్ 54లో బై నంబర్ల్లు సృష్టించి బినామీ పేర్లతో పరిహారం చెల్లించారు. నాకు మాత్రం పరిహారం చెక్కు ఇవ్వలేదు. కలెక్టర్, జహీరాబాద్ ఆర్డీవో, నిమ్జ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. మాకు అన్యాయం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-రాజారావు, రైతు, ఎల్గోయి, ఝరాసంగం మండలం
సర్వే నంబర్ 54/7లో ఐదు ఎకరాల భూమిని అసైన్‌మెంట్‌లో నా భర్త ఇస్మాయిల్‌కు ప్రభుత్వం కేటాయించింది. అప్పటి నుంచి పం టలు సాగు చేసుకుంటున్నా. నా భర్త చనిపోయాడు. భర్త పేరున భూమిని తన పేరిట మార్చాలని అధికారులకు వద్దకు వెళ్లాను. అం తలోనే నిమ్జ్ భూసేకరణలో ఐదు ఎకరాల భూమి పోయింది. పరిహారం మంజూరైనా అధికారులకు లంచం ఇవ్వకపోవడంతో చెక్కు మాకు ఇవ్వలేదు. 2016 నుంచి అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. రికార్డులో మాత్రం నా భర్త పేరు ఉన్నప్పటికీ సర్వే నంబర్ 54కు సంబంధించి 328.10 ఎకరాలకు పరిహారం చెల్లింపు మొత్తం పూర్త్తయిందని నిమ్జ్ అధికారులు చెబుతున్నారు. పరిహా రం ఇవ్వకుండా, భూమిని మార్చకుండా ఇంత అన్యాయం చేస్తారా. మాకు న్యాయం చేయాలి.
-బీపాషా ఇస్మాయిల్, రైతు, ఎల్గోయి, ఝరాసంగం మండలం