మిరుదొడ్డి, డిసెంబర్ 22 : నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిపాలన అందించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి సోమవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సోలిపేట సతీశ్రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అల్వాల సర్పంచ్ గుర్రప్పగారి ప్రమీలదేవి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సేవచేయడం అదృష్టంగా భావించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధికి పార్టీలకతీతంగా పాలకవర్గం సహకారం అందించాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మిరుదొడ్డి మండల మాజీ వైస్ ఎంపీపీ పోలీస్రాజులు, అల్వాల మాజీ సర్పంచ్ గుర్రప్పగారి రాజు, బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు సూకురి లింగం, గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.