దౌల్తాబాద్, సెప్టెంబర్ 18: కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిందని, రైతు వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం పాల్పడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ పితృవియోగంతో బాధపడుతున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సరుగారి యాదవరెడ్డి కుటుంబాన్ని గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు పూర్తిగా అవినీతిమయంగా మారిందన్నారు. రైతులు, ప్రజల సమస్యల పరిషారంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు.
ఎన్నో ఆశలతో ఓట్లు వేసిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చుకలు చూపెడుతోందన్నారు. జనుము, జీలుగు విత్తనాల నుంచి మొదలుకుంటే దుకి మందు, విత్తనాలు, యూరియా కొరత, కరెంటు కోతలు ఇలా చెప్పుకొంటూ పోతే అన్నీ కోతలే పెట్టి రైతులను అరిగోస పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో యూరియా లేక చేను ఎదుగుదల ఆగిపోయిందని, పంట దిగుబడిపై ప్రభావం చూపుతోందన్నారు.
ఏ గ్రామానికి వెళ్లినా యూరియా కొరత తీవ్రంగా వేధించడంతో రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. యాసంగిలో యూరియా కొరత లేకుండా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. బోనస్ ఇస్తారని సన్న వరి రకం వరి రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారని, బోనస్ ఇవ్వకపోతే రైతులు తిరుగుబాటు చేయడం ఖాయమన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలన్నారు.
వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటలు, రోడ్లు, కల్వర్టులు వెంటనే మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో అవినీతి తిమింగలం బయటపడిందని, ఒక ఉద్యోగి కోట్లాది రూపాయలు కూడబెట్టారని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గుప్తా, యాదగిరి, వెంకట్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, దేవేందర్, రాజిరెడ్డి, దయాకర్, నరసింహారెడ్డి, మంజూర్, భార్గవ్, రామచంద్రగౌడ్, మురళి గౌడ్ పాల్గొన్నారు.