దుబ్బాక, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో కాంగ్రెస్ , కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటలోని 7, 8, 9 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు గోవిందుగారి శోభారాణి, బూరు బాబు, వనం రమేశ్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దుబ్బాకకు వచ్చి ఏమో చేస్తాడనుకుంటే ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమతమయ్యాడని ఎద్దేవా చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్‌రావు దుబ్బాకకు రైలు, రైతులకు జోడు ఎడ్లు, నాగలి, నిరుద్యోగులకు భృతి, యువతకు ఉపాధి, చేనేతలకు మెరుగైన ఉపాధి అవకాశం అంటూ హామీలు ఇచ్చాడని గుర్తు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దుబ్బాక మున్సిపల్ అభివృద్ధికి ఎన్ని వందల కోట్లు మంజూరు చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. దుబ్బాకకు వచ్చింది కేవలం కేసీఆర్‌ను తిట్టేందుకు తప్పా ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రస్తావించకపోవడం సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, నిరుపేదలను నిలువునా ముంచిందని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి కేవలం బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, రాష్ట్ర సంపదను బంధువులకు దోచిపెడుతున్నాడని విమర్శించారు. ఉచిత బస్సు దేవుడెరుగు కానీ ధర్మాజీపేటకు వచ్చే బస్సులను కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా చేసిందని మండిపడ్డారు. కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని, మన కేసీఆర్ సారే సీఎంగా ఉంటారని ప్రజలకు భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు మనోహర్‌రావు, వెంకటసర్సింహారెడ్డి, రాజమౌలి, ఎల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, కిష్టారెడ్డి, శ్రీనివాస్, విష్ణువర్దన్‌రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.