దుబ్బాక, ఫిబ్రవరి 10: కుల, మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టి కాంగ్రెస్, బీజేపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం దుబ్బాక మండలం పోతారంలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మతం పేరిట కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కులాల పేరిట కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరు ఒకేలా ఉన్నాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో బీసీల సంఖ్యను తగ్గించి చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ, ఎస్సీలను కాంగ్రెస్, బీజేపీ చిన్నచూపు చూస్తున్నాయని ఆరోపించారు. బీసీ, ఎస్సీల అభ్యున్నతి కోసం కేసీఆర్ సర్కారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, కాంగ్రెస్ సర్కారు వారి మధ్యన చిచ్చుపెట్టిందని దుయ్యబట్టారు. అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ ప్రజలను నిలువునా మోసగించిందన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేసి సీఎం రేవంత్ తన చిత్తశుద్ధ్దిని నిరూపించుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరలోనే సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుందని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్క సమీక్షా సమావేశం నిర్వహించలేదన్నారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మాటలు తప్ప పాలన చేతకాదన్నారు. ఇన్చార్జి మంత్రి సురేఖ జిల్లాకు వస్తే ఏదోరకమైన ఇష్యూ లేవనెత్తి వెళ్తున్నదని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రాజమౌళి, రవీందర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, రాజు, కైలాష్, రాంరెడ్డి, వంశీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.