రాయపోల్, మే 5: వడగండ్ల బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం, దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామాల్లో వడగండ్ల వానతో నష్టపోయిన వరి పంటలను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. జిల్లా అధికారులు, జిల్లా మంత్రులకు సమన్వయం లేక రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందన్నారు.
ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా అధికారులు, మంత్రులతో ప్రత్యేకంగా సమవేశం ఏర్పాటు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగం విపత్కర పరిస్థితిలో ఉన్నప్పటికీ జిల్లా అధికారులు స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలపై ఫోకస్ పెడుతున్న అధికారులు రైతులకు జరిగిన నష్టంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
దుబ్బాక నియోజకవర్గంలో వడగండ్ల వాన వల్ల సుమారు 40వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినా అధికారులు ఉదాసీన వైఖరి అవలంబించడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా అవినీతి జరుగుతుందని, కిందిస్థాయి ఉద్యోగులను బదిలీ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మండల తహసీల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి బాబునాయక్, ఏపీఎం కిషన్, మండల వ్యవసాయాధికారి నరేశ్, మాజీ జడ్పీటీసీ యాదగిరి, బీఆర్ఎస్ రాయపోల్,దౌల్తాబాద్ మండలాల అధ్యక్షులు వెంకటేశ్వరశర్మ,సయ్యద్ రహీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట యువజన నాయకుడు రాజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
తొగుట, మే 5: వడగండ్ల వానతో చేతికి వచ్చిన పంట నేలరాలిపోవడంతో రైతులు బోరుమని విలపిస్తుంటే వారికి భరోసా కల్పించాల్సిన కలెక్టర్ భూ భారతి మీటింగ్‌కు వెళ్లడం చూస్తే రైతులపై పాలకులకు ఏపాటి శ్రద్ధ ఉందో అర్థమవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. వడగండ్ల వానతో సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో పంటలకు తీవ్రనష్టం జరగ్గా కాన్గల్, లింగంపేటలో సోమవారం వరి పంటలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన పరిశీలించారు.
లింగంపేటలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగంపేట, కాన్గల్, తొగుట, పెద్దమాసాన్‌పల్లి, బండారుపల్లి, ఎల్లారెడ్డిపేట, ఘనపూర్, గుడికందుల, గోవర్ధనగిరి గ్రామాల్లో పూర్తి స్థాయిలో పంట, ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పం దించి ఎకరాకు రూ.35 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలన్నారు. తహసీల్దార్ శ్రీకాంత్, ఏవో మోహన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, దోమల కొమురయ్య, కనకయ్య, వెల్పుల స్వామి, రమేశ్, నర్సింహులు, గొడుగు ఐయిలయ్య, యాదగిరి, ఎల్లం, ప్రవీణ్‌రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్, అశోక్, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీధర్, బైరాగౌడ్, మల్లయ్య, నర్సాగౌడ్, కరుణాకర్, స్వామిగౌడ్, రాము లు, రాంబాబు పాల్గొన్నారు.