గజ్వేల్, ఫిబ్రవరి 25: కరువు కాటకాలకు నిలయమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, వెంటనే ఉపకాల్వలు నిర్మించి నియోజకవర్గలోని గ్రామాలకు సాగునీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం చొరవ చూ పాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో బుధవారం నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో ఆయ న సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రధా న కాలువలు, ఉపకాల్వల భూసేకరణ, పరిహారం, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి వనరులు ఉన్న వాటిని వినియోగించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉందన్నారు. కేసీఆర్ హ యాంలో కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు నిర్మించుకొని ప్రధాన కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేశామని, కానీ నేడు కాంగ్రెస్ వచ్చిన రెండున్నరేండ్లలో సాగునీరు ఇవ్వడం లేదన్నారు. ఇర్కో డు ఎత్తిపోతలకు నిధులు ఉన్నా పంప్‌హౌస్ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడంపై కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేండ్లలో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో రామాయంపేట, శం కరంపేట, ఉప్పర్‌పల్లి, దుబ్బాక ప్రధాన కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేశామన్నారు. వెనుకబడిన దుబ్బాక ప్రాంతంపై సీఎం రేవంత్రెడ్డిచొరవ తీసుకొని కాల్వల నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు. రైతులే సొంతంగా ప్రొక్ల్లెయిన్లతో కాల్వలు తవ్వుకుంటున్నా అధికారులు సహకరిస్తలేరని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపకాల్వలు పూర్తయితే దుబ్బాక నియోజకవర్గంలోని 1,20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. త్వరగా భూసేకరణ పూర్తి చేసి కాల్వ నిర్మాణాలు పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో సాగునీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.