గజ్వేల్, జూలై 11: కేంద్ర ప్రభుత్వం అందించే కాయకల్ప అవార్డుకు గజ్వేల్ జిల్లా దవాఖాన ఎంపికైందని ఆ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ తెలిపారు. జిల్లాలోని దవాఖానలకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఏరియా దవాఖానలు పోటీలో ఉండగా బెల్లంపల్లి దవాఖాన రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలువగా గజ్వేల్ దవాఖాన రెండో స్థానంలో నిలిచిందన్నారు.
సిద్దిపేట జిల్లా నుంచి గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, నంగునూర్, చేర్యాల ఏరియా దవాఖానలు కాయకల్ప అవార్డుకు పోటీ పడ్డాయన్నారు. గజ్వేల్ దవాఖాన రాష్ట్ర స్థాయిలో రెండో బహుమతి కింద రూ.10లక్షలు, దుబ్బాక ఏరియా దవాఖానకు ప్రోత్సాహక బహుమతి రూ.లక్ష, ఎకో ఫ్రెండ్లీ అవార్డు కింద రూ.5లక్షలు, హుస్నాబాద్ ఏరియా దవాఖానకు ప్రోత్సాహక బహుమతి కింద రూ.లక్ష నగదు అవార్డు లభించిందన్నారు. జిల్లాలోని దవాఖానల పనితీరును మరింత మెరుగుపర్చుతామన్నారు.